కరోనా కోసం నెల్లూరు ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందు వల్ల ఇబ్బందులు లేవని ప్రభుత్వం తేల్చటం, కోర్టు కూడా మందు పంపిణీ కోసం అనుమతివ్వటంతో మందు తయారీ ఏర్పాట్లలో ఆనందయ్య శిష్యులు నిమగ్నమయ్యారు. అయితే ఆనందయ్య మందు పంపిణీ స్టార్ట్ చేస్తే… ప్రజలు భారీగా కృష్ణపట్నం వచ్చే అవకాశం ఉంది. దీంతో కరోనా ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మందు తయారీపై వన మూలికలు, ముడి పదార్థాలు సేకరిస్తూనే మందు పంపిణీపై ఆనందయ్య కార్యాచరణ ఆలోచిస్తున్నారు. మందు పంపిణీ స్టార్ట్ చేయటం మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉండగా, మందు పంపిణీపై ఆనందయ్య నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుతో సమావేశం అయ్యారు. మందు కోసం ఎవరూ నెల్లూరు రావద్దని, అవసరం అయితే మొబైల్ యాప్ ద్వారా ఆనందయ్య మందును డోర్ డెలివరీ చేసేందుకు ఆలోచిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆనందయ్య కూడా ఈ అంశానికి మద్ధతు తెలిపారు. ఆన్ లైన్ ద్వారా మందు పంపిణీ చేస్తే కరోనా నిబంధనల ఉల్లంఘన జరగదన్నారు. అయితే ఆనందయ్య పంపిణీ కోసం మరో ఐదు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.