Tuesday, November 19, 2024

Delhi | ఢిల్లీ చేరిన‌ కులాంతర వివాహ జంట.. మాజీ మంత్రి పేర్నినానిపై ఆరోపణలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కులాంతర వివాహం చేసుకున్నందుకు తమను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారంటూ ఓ జంట ఆంధ్రప్రదేశ్ నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీ చేరుకుంది. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్ చేరుకున్న ఈ జంట అక్కడ మీడియా సమావేశం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌ విజయవాడ సమీపంలోని పెనమలూరు మండలం పోరంకి గ్రామానికి చెందిన అనూష, జ్ఞానేంద్ర ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరిలో అనూష దళితవర్గానికి చెందగా, జ్ఞానేంద్ర వెనుకబడిన వర్గానికి చెందినవాడు.

కులాంతర వివాహం ఇష్టం లేని జ్ఞానేంద్ర తరఫు బంధువులు ఇద్దరినీ చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. వారిలో మాజీ మంత్రి పేర్ని నాని అనుచరుడు పరింకాయల విజయ్ చంద్ర కీలకంగా వ్యవహరిస్తున్నారని దంపతులిద్దరూ ఆరోపిస్తున్నారు. ఈ బెదిరింపుల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం ఎదుట మూడు రోజుల పాటు నిరసన తెలిపినా సరే తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రక్షణ కోరగా, తమ జోలికి వెళ్లొద్దంటూ కోర్టు ఆదేశాలిచ్చిందని, అయినప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ హతమార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

- Advertisement -

ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తమకు న్యాయం చేయడం లేదని, అందుకే తాము రాష్ట్రప్రతిని కలిసి తమ ఆవేదన చెప్పుకుంటామని అంటున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని సైతం తమను ఇబ్బందులకు గురి చేశారని దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. రక్షణ కోరి తాము వెళ్తే తమపైనే కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. అనూష మాట్లాడుతూ ఆడపిల్లలని కూడా చూడకుండా తనపై, తన పిల్లలపై దాడులు ప్రయత్నించారని, హతమార్చేందుకు యత్నించారని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement