Saturday, November 23, 2024

ఆరోగ్య మహిళకు శ్రీకారం.. మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 100 పిహెచ్‌సిలలో ప్రారంభం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని మహిళల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం ఆరోగ్య మహిళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం రాష్ట్ర్రంలోని 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారు. ప్రతీ మంగళవారం పిహెచ్‌సిలలో మహిళలకు ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అక్కడికక్కడే తగిన మందులు ఇవ్వడంతో పాటు అవసరమైన వారిని రెఫరల్‌ ఆసుపత్రులకు పంపిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 33 జిల్లాలలో అన్ని వయస్సుల మహిళలకు 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ప్రధానంగా 8 ప్యాకేజీలుగా విభజించిన ఈ ఆరోగ్య మహిళ కార్యక్రమంలో డయాగ్నస్టిక్స్‌, క్యాన్సర్‌ స్క్రీనింగ్‌, సరైన ఆహారం లేకుండా వచ్చే సమస్యలు, మూత్ర సంబంధిత సమస్యలు, మోనోపాజ్‌ సంబంధిత, కుటుంబ నియంత్రణ, ఇన్ఫర్టిలిటీ తదితర సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలను రాష్ట్ర్రంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన మొత్తం 20 పాథాలజికల్‌ ల్యాబ్‌లలో నిర్వహిస్తారు.

సమస్యలు ఉన్న వారికి కౌన్సిలింగ్‌ సైతం నిర్వహిస్తారు. వీటితో పాటు బీపీ, షుగర్‌, అనీమియా పరీక్షలను అన్ని పిహెచ్‌సిలలో నిర్వహిస్తారు. ఈ పరీక్షల ఫలితాలను 24 గంటలలోగా అందజేస్తారు. మహిళలలో క్యాన్సర్‌ వ్యాధి అవకాశాలు ఎక్కువగా ఉండడంతో వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే, ఈ ఆరోగ్య మహిళ కార్యక్రమంలో పిహెచ్‌సిలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలలో 30 ఏళ్లు పైబడ్డ మహిళలకు బ్రెెస్ట్‌ క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు చేపడతారు. జిల్లా కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రులలో మామోగ్రామ్‌, కల్పోస్కోపి, క్రియోథెరపి, బయాప్సి, పాప్‌ స్మియర్‌ పరీక్షలు నిర్వహిస్తారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌, ఎంఎన్‌జె క్యాన్సర్‌ ఆసుపత్రులలో నిర్ధారిత క్యాన్సర్‌ మహిళలకు చికిత్స అందజేస్తారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఆరోగ్య మహిళా హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లతో పాటు పేషెంట్‌ కేర్‌ కార్యకర్తలను నియమిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement