Wednesday, November 20, 2024

భారత సంతతి విద్యార్థిని ప్రపంచ మేథావి.. నటాషా అరుదైన ఘనత

ఇండో-అమెరికన్‌ విద్యార్థిని నటాషా పెరియనాయగమ్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థుల జాబితాలో చోటు దక్కించుకుంది. అమెరికాలోని జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీకి చెందిన సెంటర్‌ ఫర్‌ టాలెంటెడ్‌ యూత్‌ (సీటీవై) ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో నటాషా అద్భుత ప్రతిభ కనబరిచింది. ప్రపంచ వ్యాప్తంగా 76 దేశాల నుంచి 15,300 మందికిపైగా విద్యార్థులు ఈ పోటీ పరీక్షల్లో పాల్గొనగా కేవలం 27 శాతం కంటే తక్కువ మంది మాత్రమే అర్హత సాధించారు. అందులో నటాషా ప్రథమ స్థానంలో నిలిచింది.

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత చురుకైన విద్యార్థులను, వయసుకు మించి తెలివితేటలు కలిగిన విద్యార్థులను గుర్తించేందుకు సీటీవై ప్రతియేటా విభిన్న పరీక్షలు నిర్వహిస్తుంటుంది. న్యూజెర్సీలోని ఫ్లోరెన్స్‌ స్కూల్‌లో చదువుతున్న నటాషా 2021 టాలెంట్‌ పరీక్షల్లోనూ సత్తా చాటింది. అప్పట్లో ఐదవ తరగతి చదువుతున్న ఆమె ఎనిమిదో తరగతి విద్యార్థి స్థాయి ప్రతిభ ప్రదర్శించింది. వెర్బల్‌, క్వాంటిటేటివ్‌ విభాగాల్లో 90శాతం స్కోర్‌ చేసింది.

తద్వారా ప్రపంచ బాల మేధావిగా అరుదైన గౌరవాన్ని సాధించింది. తాజాగా మరోసారి సీటీవై పరీక్షల్లో నటాషా తన ప్రతిభను చాటుకుంది. గతంలో తెలివైన విద్యార్థుల జాబితాలో నిలిచిన ఈమె ఇప్పుడు ప్రథమ స్థానంలోకి ప్రవేశించింది. స్కాలాస్టిక్‌ ఆప్టిట్యూట్‌ టెస్ట్‌, ఏటీసీ పరీక్షల్లో నటాషా మంచి స్కోరు చేసినట్లు హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ ప్రకటన వెల్లడించింది. నటాషా తల్లిదండ్రులు చెన్నై వాసులు. ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement