Tuesday, November 26, 2024

ఓ ఐడియా మార్చేస్తుంది.. నిర్మాణం నుంచి నిర్వహణ వరకు..

ప్ర‌భ‌న్యూస్ : నిర్వహణా భారాన్ని భరించలేమంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కు, ఎయిర్‌ ఇండియా వంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వరంగ సంస్థల్ని కూడా వదిలించుకుంటున్నాయి. కానీ చిన్న చిన్న అంశాల్ని మాత్రం తలకెత్తుకుంటున్నాయి. వాటి నిర్వహణా భారాన్ని భుజాన్నేసుకుంటున్నాయి. వాస్తవానికి ప్రస్తుత చట్టాల్లో కొద్దిపాటి సవరణలతో ఇటువంటి అంశాల నిర్వహణను పూర్తిగా ప్రైవేటు, కార్పొరేట్‌ వ్యవస్థలకు అప్పగించొచ్చు. దీంతో నిర్మాణం నుంచి నిర్వహణ వ్యయం వరకు ప్రభుత్వానికి తప్పుతుంది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌, బ్యాటరీ, చార్జింగ్‌ కేంద్రాల నిర్మాణానికి కేంద్రం పూను కుంది. ఇందుకోసం అనువైన ప్రాంతాల్లో స్థలాల్ని ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభించింది. ఒక్కో స్టేషన్‌ నిర్మాణానికి కోట్లలోనే వ్యయమౌతుంది. పైగా వీటి నిర్వహణ బాధ్యత కూడా ప్రభుత్వానిదే. అలాగే దేశంలోని అతిపెద్ద నగరాల నుంచి సాధారణ పట్టణాల వరకు వాహనాల పార్కింగ్‌ ప్రదేశాల ఏర్పాటు బాధ్యతను ప్రభుత్వాలు తలకెత్తుకుంటున్నాయి. ఇందుకోసం సామాన్యుడి స్థలాల్ని ఎంచుకుంటున్నాయి.

ఈ స్థలాల్లో తగిన వసతుల్ని కల్పించి వాహనాలకు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసి పార్కింగ్‌ సదుపాయాల్ని కల్పించాలని పథకాలకు శ్రీకారం చుడుతున్నాయి. మరో వైపు పరిశుభ్రత కోసం బహిరంగ ప్రదేశాల్లో వీలైనన్ని చోట్ల మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా ప్రభుత్వాలు సంకల్పించాయి. తద్వారా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కాలకృత్యాలు తీర్చుకోవడంతోపాటు స్నానం చేసే వెసులుబాటును కల్పించాలని నిర్ణయించాయి. ఇలాంటి అవసరాలన్నింటికి ప్రస్తుతం భవన నిర్మాణాల అనుమతికున్న కొన్ని అడ్డంకుల్ని తప్పించడం ద్వారా పెద్దెత్తున కార్పొరేట్‌, ప్రైవేటు నిర్మాణ సంస్థలే చేపట్టే విధంగా అవకాశాలు న్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు నాలుగైదొందల చదరపు గజాల్లో మూడ్నాలుగు అంతస్తుల భవనాలకు మాత్రమే అనుమతిస్తున్నారు. వీటిలో తగిన పార్కింగ్‌ సదుపాయం ఉండదు. ఇతర మౌలిక సదుపాయాలుండవు. నివాసితులతో పాటు ఇతరులకు కూడా వీటి వల్ల ఇబ్బందులు తప్పడంలేదు.

అదే కనీసం వెయ్యి నుంచి పదిహేను వందల గజాల్లో మాత్రమే బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి అనుమతివ్వాలి. అది కూడా 15నుంచి 40 అంతస్తుల వరకు నిర్మాణాన్ని అనుమతించాలి. ఇప్పటికే ముంబై నగరాల్లో వందకుపైగా అంతస్తుల భవనాల నిర్మాణం జరుగుతోంది. అలాగే చెన్నై, హైదరాబాద్‌ల్లో కూడా 70కి పైబడ్డ అంతస్తుల నిర్మాణాలు సాగుతున్నాయి. ఇతర నగరాలు, పట్టణాలకు కూడా ఈ విధానాన్ని వర్తింపజేయాలి. భూమిని వీలైనంత తక్కువగా వినియోగించుకోవాలి. ఎక్కువ మందికి వసతి అవకాశాలు కల్పించగలగాలి. ఎక్కువ అంతస్తుల భవనాల నిర్మాణంలో పార్కింగ్‌కి కూడా మంచి వెసులుబాటుం టుంది. క్రింది నుంచి నాలుగైదు అంతస్తుల వరకు పూర్తిగా పార్కింగ్‌కే వదిలేయాలి. అలాగే గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఎలక్ట్రిక్‌, బ్యాటరీ చార్జింగ్‌ యూనిట్లను నెలకొల్పుకునేందుకు అనుమతివ్వాలి. వీటితో పాటు స్వచ్ఛ సర్వేక్షణ్‌ క్రింద గ్రౌండ్‌ ఫ్లోర్‌లో బాత్రూమ్‌, మరుగుదొడ్ల నిర్మాణాల్ని ప్రోత్సహించాలి.

వీటివల్ల అతితక్కువ స్థలంలో ఎక్కువమందికి వసతి ఏర్పడుతుంది. అలాగే అందులో నివాసితులందరికీ ఖచ్చితంగా పార్కింగ్‌ సదుపాయం ఉంటుంది. వీటితో పాటు అదనంగా చార్జింగ్‌ వ్యాపారం నిర్వహించుకునే వెసులుబాటు బిల్డర్‌ లేదా ప్రమోటర్‌కు ఉంటుంది. వీటన్నింటితో సహా స్వచ్ఛ సర్వేక్షణ్‌ పథకానికి ఉపకరించే వెసులుబాటు కలుగుతుంది. ప్రస్తుతం బహుళ అంతస్తుల భవనాల్లోని పార్కింగ్‌ల్లో రాత్రిపూట గరిష్టంగా 65శాతం, పగటి పూట 30శాతం మాత్రమే వాహనాలు పార్కింగ్‌ ప్రదేశంలో ఉంటున్నాయి. మిగిలిన పార్కింగ్‌ స్థలమంతా ఖాళీగానే ఉంటోంది. ఈ పార్కింగ్‌ స్థలాన్ని ఆ ప్రాంతంలో మార్కెట్లకొచ్చే వాహనాల తాత్కాలిక నిలుపుదలకు రుసుం వసూలు చేసే విధానంలో కేటాయించొచ్చు. దీనివల్ల అదనపు ఆదాయం సమకూరుతుంది. అలాగే చార్జింగ్‌ పాయింట్ల నిర్వ హణ వల్ల వీరికి ఆదాయమొస్తుంది.

భవిష్యత్‌లో పెరగనున్న విద్యుత్‌, బ్యాటరీ వాహనదార్లకు రీచార్జ్‌ వెసులుబాటు పలుచోట్ల అందుబాటులోకొస్తుంది. వీటన్నింటితో పాటు మరుగుదొడ్ల నిర్వహణ ద్వారా కూడా మరికొంత ఆదాయం లబిస్తుంది. చైనా వంటి దేశాల్లో బహుళ అంతస్తుల భవనాల్లోని సెల్లార్‌లు, గ్రౌండ్‌ ఫ్లోర్‌లలో పబ్లిక్‌ టాయిలెట్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. తద్వారా ఇతర ప్రాంతాల నుంచి నగ రాలు, పట్టణాలకొచ్చే వారి బాత్రూమ్‌ అవసరాలు తీరతాయి. నగరాలు, పట్టణాల్లో పరిశుభ్ర వాతావరణ కల్పనకు ఇవి ఉపకరిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పురాతన చట్టాలు, విధివిధానాల పున:సమీక్షతోపాటు సవరణలకు ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయి. తద్వారా వీలైనంతగా తమ నిర్వహణా వ్యయాన్ని తగ్గించుకుంటున్నాయి. అదే సమయంలో ప్రజలకు మరిన్ని అదనపు సౌకర్యాలు, సదుపాయాలు అందుబాటులోకి తెస్తున్నాయి.

- Advertisement -

భారత్‌లో మాత్రం ఇందుకు భిన్నమైన వైఖరి కొనసాగుతోంది.పెద్ద పెద్ద పరిశ్రమలు, వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించే ప్రభుత్వరంగ సంస్థల్ని నిర్వహణ భారం పేరిట ప్రభుత్వాలు వదిలించుకుంటున్నాయి. మరోవైపు బ్యాటరీ చార్జింగ్‌ కేంద్రాలు, సామాజిక పార్కింగ్‌ స్థలాలంటూ ప్రయత్నా లు చేస్తున్నాయి. నిర్మాణ అనుమతులకు సంబంధించి కొద్దిపాటి సవరణలతో పైసా ఖర్చులేకుండా వీటన్నింటిని ప్రజలకు అందు బాటులో పెట్టే అవకాశాలు లభిస్తాయి. ఒకవేళ నాలుగైదొందల చదరపు గజాలు మాత్రమే అందుబాటులో ఉన్న పక్షంలో ఒకరిద్దరు కలసి ఉమ్మడిగా నిర్మాణాలు చెపట్టే వెసులుబాటు ఎలాగూ ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement