Tuesday, November 26, 2024

విద్యుత్ పంపిణీ సంస్థల బకాయిలకు సులభ వాయిదా పద్ధతి.. వినియోగదారుడిపై తగ్గనున్న భారం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల)పై ఉన్న బకాయిల భారం మొత్తం విద్యుత్ వ్యవస్థను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. భారీగా పేరుకుపోయిన బకాయిలు, వాటిపై విధించిన లేట్ పేమెంట్ సర్‌చార్జి భారంతో విద్యుత్ పంపిణీ సంస్థలు పాత బకాయిలను చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా విద్యుదుత్పత్తి సంస్థలు సైతం తమకు రావాల్సిన బకాయిలు రాకపోవడంతో, ఆ సంస్థలు చెల్లింపులు జరపాల్సిన బొగ్గు ఉత్పత్తి సంస్థలకు సకాలంలో చెల్లించలేకపోతున్నాయి. అలాగే విద్యుదుత్పత్తి సంస్థల నిర్వహణపై కూడా దీని ప్రభావం పడుతోంది. అంతిమంగా ఈ మొత్తం భారం వినియోగదారుడిపై పడుతోంది. ఈ పరిస్థితిని నివారించడం కోసం బకాయిలను సులభ వాయిదా పద్ధతిలో 48 నెలల్లో ఈఎంఐ చెల్లించేలా కేంద్ర విద్యుత్ శాఖ కసరత్తు చేస్తోంది.

ఈ ఏడాది మే 18వ తేదీ వరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం దేశంలోని విద్యుత్ పంపిణీ సంస్థల బకాయిలు మొత్తం రూ. 1,00,018 కోట్లుగా తేలింది. బకాయిలను ఆలస్యంగా చెల్లించినందుకు అదనంగా రూ. 6,839 కోట్ల మేర లేట్ పేమెంట్ సర్‌చార్జి చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర విద్యుత్ శాఖ చేస్తున్న కసరత్తు ప్రకారం పథకాన్ని అమలు చేస్తే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ పంపిణీ సంస్థలు రానున్న నాలుగేళ్లలో చెల్లించాల్సిన ఆలస్యపు రుసుము రూ. 19,833 కోట్ల మేర ఆదా అవుతుంది.

ఇందులో బకాయిలు పెద్దమొత్తంలో పేరుకుపోయిన తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు రూ. 4,500 కోట్ల మేర ఆదా అవుతుండగా, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి రూ. 2,500 కోట్ల మేర ఆదా అవుతుంది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా జమ్ము-కశ్మీర్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు రూ. 1,100 కోట్ల నుంచి 1,700 కోట్ల మేర లబ్దిచేకూరనుంది. సాధారణంగా ఈ మొత్తం భారాన్ని వినియోగదారులపై మోపాల్సిన తరుణంలో, కొత్త విధానం ద్వారా వినియోగదారుడికి ఆ మేరకు ఉపశమనం లభించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement