ఉన్మాద స్థితిలోకి దేశాన్ని నెట్టేసేందుకు కొన్నిశక్తులు యత్నిస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవన్నీ చూస్తూ కూడా చూడనట్టు కూర్చోవడం సరికాదని.. ధీరోదాత్తులు, మేధావులు, వైతాళికులు కరదీపికలుగా మారితేనే సమాజం బాగుపడుతుందన్నారు. ఎల్బీ స్టేడియంలో స్వాతంత్య్ర వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. గాంధీజీ లాంటి స్వాతంత్య్ర సమరయోధుల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఈతరంపై ఉందన్నారు.
పేదల ఆశలు ఇంకా నెరవేరలేదని..స్వాతంత్య్ర ఫలాలు అందలేదని అనేక వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. అనేక వర్గాల ప్రజలు తమకు న్యాయం జరగలేదనే భావనలో ఉన్నారన్నారు. కేశవరావు కమిటీ స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా వివిధ రకాల కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిందని కేసీఆర్ అన్నారు.
ఈ సందర్భంగా సురవరం ప్రతాప రెడ్డి వారసుడు సురవరం అనిల్ కుమార్ రెడ్డి, భాగ్యరెడ్డి వర్మ వారసుడు అజయ్ గౌతమ్, కొమరం భీం వారసుడు కుమరం సోనేరావు, కల్నల్ సంతోష్ బాబు తండ్రి బిక్కుమళ్ల ఉపేందర్, వనజీవి రామయ్య, రావెళ్ల వెంకట్రామారావు తనయుడు రావెళ్ల మాధవరావు, బాక్సర్ నిఖత్ జరీన్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజ, బాక్సర్ మహ్మద్ హుసాముద్దీన్, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ తదితరులను సీఎం కేసీఆర్ సన్మానించారు.
75 ఏండ్ల స్వాతంత్ర్య ఫలాలను భారత ప్రజలు ఆస్వాదిస్తున్న వేళ… నాటి అమరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ.. ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ముఖ్య అతిథిగా, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు., పలు రంగాలకు చెందిన అతిరథ మహారథులు పాల్గొన్నారు. వేలాదిగా హాజరైన ఆహుతుల నడుమ ఎల్బి స్టేడియం లో వైభవోపేతంగా “స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహం ” ముగింపు వేడుకలు జరుగుతున్నాయి.
ఈ క్రంమలో దీపిక రెడ్డి “ఝాన్సీ లక్ష్మిబాయి” ప్రారంభ నృత్య రూపకం ఆకట్టుకుంది. అనంతరం.. గంగా జమున తేహజీబ్ కు ప్రతీకగా ఎల్బీ స్టేడియం చప్పట్లతో మారుమోగగా కొనసాగిన ఖవ్వాలి ” కార్యక్రమం జరిగింది. ఇక.. శంకర్ మహదేవన్ సంగీత కార్యక్రమంతో అంతా సంతోషం వ్యక్తం చేశారు.