అమెరికాలో తుపాకీ కాల్పుల మోత ఆగడంలేదు.. తరచూ ఎక్కడో ఓ చోట కాల్పుల ఘటన చోటుచేసుకుంటూనే ఉంది. తాజాగా మిషిగాన్ రాష్ట్రంలో ఓ దుండగుడు చిన్న పిల్లల పార్క్ లోకి చొరబడి కాల్పులు జరిపాడు. దీంతో చిన్నారులు సహా మొత్తం 8 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. వారిలో ఎనిమిదేళ్ల బాలుడి పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు వెల్లడించారు.
మిషిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ సబర్బన్ లో ఓ వాటర్ పార్క్ ఉంది. పిల్లల కోసం ప్రత్యేకంగా కట్టిన ఈ పార్క్ వారాంతాల్లో సందడిగా ఉంటుంది. ఎప్పట్లానే ఈ ఆదివారం కూడా పిల్లలు, వారి తల్లిదండ్రులతో సందడిగా ఉంది. ఇంతలో పార్కులోకి చొరబడ్డ ఓ దుండగుడు అక్కడున్న వారిపై తుపాకీ ఎక్కుపెట్టాడు. పిల్లలతో పాటు వారితో వచ్చిన పెద్దవారిపైనా కాల్పులు జరిపాడు. ఆపై పార్క్ లో నుంచి బయటపడి సమీపంలోని ఇళ్ల వైపు వెళ్లాడు. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది గాయపడ్డారు.బుల్లెట్ గాయాలైన ఎనిమిదేళ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.
కాల్పుల సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాధితులను ఆసుపత్రికి తరలించడంతో పాటు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ఆధారంగా నిందితుడి కారును గుర్తించినట్లు తెలిపారు. పార్క్ కు దగ్గర్లోని ఓ ఇంటి ఆవరణలో కారు పార్క్ చేసి ఉందని చెప్పారు. దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.