న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అమరావతి – 3 రాజధానుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో అటు అమరావతి రైతులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జులై 11కు వాయిదా పడింది. ఇంకా ముందే విచారణ చేపట్టి తీర్పునివ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం విచారణ జరపాల్సిన కేసుల జాబితాలో మంగళవారం అమరావతి కేసుకు ఉంది. వరుస క్రమంలో 10వ స్థానంలో ఉన్నప్పటికీ, విచారణకు వచ్చేసరికి సాయత్రం గం. 4.00 దాటింది. మధ్యాహ్నం భోజన విరామ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తమ కేసు విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని కోరగా.. కోర్టు పద్ధతులు పాటించాలని, వరుస క్రమంలో కేసు విచారణ చేపడతామని న్యాయమూర్తులు సున్నితంగా వారించారు.
సాయంత్రం విచారణ చేపట్టే సమయానికి కోర్టు సమయం దాదాపుగా ముగిసిపోయంది. ఈ పరిస్థితుల్లో తదుపరి విచారణ తేదీని జులై 11గా ధర్మాసనం ఖరారు చేసింది. అయితే ఇంకా ముందే విచారణ చేపట్టి కేసును త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేకే వేణుగోపాల్ సహా ఇతర న్యాయవాదులు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. కనీసం ఏప్రిల్ నెలలోనైనా చేపట్టాలని పదే పదే కోరారు. అయినప్పటికీ ధర్మాసనం అంగీకరించలేదు.
ఈ కేసులో వాద, ప్రతివాదులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, అందరి వాదనలు వినాల్సి ఉంటుందని ధర్మాసనం వెల్లడించింది. అలాగే అనేక కీలక అంశాలు కూడా ముడిపడి ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈ దశలో కనీసం హైకోర్టు తీర్పుపై ‘స్టే’ కోరుతూ దాఖలు చేసిన తమ పిటిషన్పై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కేకే వేణుగోపాల్ కోరారు. అయితే ఇంకా అనేక కేసులు విచారణ జరపాల్సి ఉందని, ఇదొక్కటే కాదని ధర్మాసనం పేర్కొంది.
జూన్లో జోసెఫ్ పదవీ విరమణ
అమరావతి – 3 రాజధానుల వ్యవహారంపై అటు రైతులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ధర్మాసనంలోని జస్టిస్ కేఎం జోసెఫ్ జూన్ నెలలో పదవీ విరమణ పొందనున్నారు. కేసు తదుపరి విచారణ జులై 11గా ఖరారు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం మారనుంది. తదుపరి ఏ బెంచ్ ముందుకు వెళ్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.