Friday, November 22, 2024

New virus | మెదడును తినే అమీబా.. వెలుగులోకి అరుదైన ఇన్‌ఫెక్షన్

దక్షిణ కొరియాలో మరో అరుదైన మహమ్మారి వెలుగులోకి వచ్చింది. మెదడుకు సోకే ఈ అరుదైన ఇన్‌ఫెక్షన్‌ను నెగ్లెరియా ఫౌలెరిగా పిలుస్తున్నారు. ఈ ఇన్‌ఫెక్షన్‌ సోకి 50 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఇతడికి థాయ్‌లాండ్‌లో వైరస్‌ సోకివుండొచ్చని భావిస్తున్నారు. ఇతడు మూడు నెలలు అక్కడే ఉండి, డిసెంబర్‌ 10న దక్షిణ కొరియాకు చేరుకున్నాడు. ఆ వ్యక్తి మెనింజైటిస్‌ లక్షణాలను ప్రదర్శించడం ప్రారంభించాడు. తలనొప్పి, జ్వరం, వాంతులు, అస్పష్టమైన మాటలు, మెడ బిగుసుకుపోవడం వంటి సమస్యలను ఎదుర్కొన్నాడు.

11 రోజుల తరువాత మరణించాడు. పోస్ట్‌మార్టం పరిశోధన తర్వాత మరణానికి కారణం నిర్ధారించబడింది. దేశంలో నేగ్లేరియా ఫౌలెరీ ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించిన మొదటి ధృవీకరించబడిన కేసు ఇదేనని కొరియన్‌ టైమ్స్‌ పేర్కొంది. ఈ ఇన్‌ఫెక్షన్‌ను మెదడును తినే అమీబాగా పేర్కొంటారు. ఈ విషయాన్ని ద.కొరియా డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ఏజెన్సీ (కేడీసీఏ) ధ్రువీకరించింది.

నెగ్లెరియా ఫౌలెరి అంటే?

ఇది ఒకరకమైన ఏక కణ సూక్ష్మజీవి. సాధారణంగా అమీబాలు ప్రకృతిలో చాలాచోట్ల ఉంటాయి. మంచినీరు, నీటి లీకేజీల్లో, కాల్వలు, నదులు, మట్టిలోనూ ఉంటాయి. అన్నిరకాల అమీబాలు ప్రాణాంతకం కాదు. కానీ నెగ్లెరియా రకం అమీబా ప్రత్యేకించి మానవులకు సోకుతుంది. వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఈ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తిచెందుతుంది. అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ప్రకారం నెగ్లెరియా ఫౌలెరి ముక్కుద్వారా మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి మెదడుకు చేరుతుంది. మెదడులోని కండరాలు, నరాలను దెబ్బతీస్తుంది. ఇది ప్రైమరి అమీబిక్‌ మెనింజో ఎన్‌సైఫలిటీస్‌ (పిఎంఏ) అనే ఇన్‌ఫెక్షన్‌ను కలగజేస్తుంది. ఇది ప్రాణాంతకమైంది.

- Advertisement -

లక్షణాలు ఏమిటి?

ఈ వైరస్‌ బారిన పడినవారిలో తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు, ముక్కు బిగుసుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తల ముందు భాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇన్‌ఫెక్షన్‌ తీవ్రమైతే మూర్చ, గందరగోళం, వంటి లక్షణాలతో పాటు కొన్నిసార్లు రోగి కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ ఇన్‌ఫెక్షన్‌ చాలా తీవ్రమైంది. ఒకవేళ పరిస్థితి సీరియస్‌గా ఉంటే, అది మానసిక సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. ఈ ఇన్‌ఫెక్షన్‌ మనుషుల నుంచి మనుషులకు సోకదు. ఇది నీటి ఆవిరి లేదా ఏరోసోల్‌ బిందువుల ద్వారా కూడా వ్యాపించదు. అమెరికాలో 1962 నుంచి 2021 వరకు154 మందికి సోకింది. వీరిలో కేవలం నలుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

చికిత్స ఏమిటి?

ప్రస్తుతానికి కొన్ని రకాల చికిత్సలతో ఉపశమనం కలిగిస్తున్నారు. కానీ, ఇన్‌ఫెక్షన్‌ ప్రభావం నుంచి పూర్తి రక్షణ కల్పించే వైద్య చికిత్సలు ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. కొన్నిరకాల ఔషధ సమ్మేళనాలతో వైద్యం చేస్తున్నారు. యాంఫోటెరసిస్‌ బి, అజిత్రోమైసిన్‌, ఫ్లూకోనజోల్‌, రిఫాపిస్‌, మిల్టెఫోసిస్‌, డెక్సామెథాసిస్‌ వంటి వాటిని చికిత్సకు వాడుతున్నట్లు సీడీసీ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement