ప్రపంచంలో అమ్మ, నాన్న కంటే 5జీ ముఖ్యమైందికాదని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో గొప్పది. అమ్మానాన్నల ప్రాముఖ్యాన్ని విద్యార్ధులకు అర్ధమయ్యేలా ఆయన వినూత్నంగా చెప్పారు. గుజరాత్‌లోని పండిత్ దీన్‌దయాల్ ఎనర్జీ యూనివర్శిటీలో జరిగిన స్నాతకోత్సవానికి ముఖేష్ అంబానీ ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. పట్టా అందుకోనున్న విద్యార్ధులకు ఇది ప్రత్యేకమైన రోజు, ప్రపంచానికి మీరెంటో తెలిసే రోజు అని ఆయన చెప్పారు. వీరు నిల్చున్నది మాత్రం మీ తల్లిదండ్రులు, పెద్దవాళ్ల రెక్కలపైనే, అందు వల్ల వారికి కూడా ఇది ప్రతేమైన రోజు.
మీరు గ్రాడ్యుయేషన్ పత్రాన్ని అందుకోవాలని వారు ఎంతగానో ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఇది వారి చిరకాల స్వప్నమని, మిమ్ములను ఇక్కడి వరకు తీసుకు రావడానికి మీ తల్లిదండ్రులు చేసిన త్యాగాలు, వారి పడిన శ్రమను ఎప్పటికీ మర్చిపోవద్దని ఆయన విద్యార్ధులకు ఉద్భోదించారు. మీరు సాధించిన ఈ విజయం వెనుక వారి సహకారం ఎనలేనిదని, ఎల్లప్పుడూ వారు మీకు అండగా ఉంటారని, మీ బలానికి తల్లిదండ్రులే మూలస్థంబాలని అంబానీ చెప్పారు. ఈ రోజుల్లో యువత 4జీ, 5జీ గురించి ఉత్సాహంగా ఉన్నారు. కాని ఈ ప్రపంచంలోనే మాతాజీ, పితాజీ కంటే ఏ జీ ఎక్కువ కాదని, గుర్తుపెట్టుకోవాలన్నారు.
దేశాభివృద్ధిలో నేటి యువత పాత్ర ఎంతో కీలకమని అంబానీ ఈ సందర్భంగా చెప్పారు. యువత ఆలోచనలు, ఆవిస్కరణలతో మన దేశ ఆర్ధిక వ్యవస్థ 2047 నాటికి 3 లక్షల కోట్ల డాలర్ల నుంచి 40 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందన్న విశ్వాసం తనకు ఉందని చెప్పారు.