హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ విజయ శంఖారావం పూరించాలనే లక్ష్యంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. ప్రధాని మోడీ 9ఏళ్లలో చేసిన అభివృద్ధిని మహాజన సంపర్క్ అభియాన్‌లో భాగంగా ఆయన వివరించనున్నారు. ఇందుకు ఈ నెల 15న ఖమ్మంలో బీజేపీ అగ్రనేత అమిత్ షా టూర్ ఫిక్స్ అయింది. ఆయన పర్యటన తాలూకు షెడ్యూల్‌ను తెలంగాణ బీజేపీ సోమవారం విడుదల చేసింది.
ఈ నెల 15న భద్రాచలంలో రాములవారి దర్శనంతో అమిత్ షా తన తెలంగాణ పర్యటనను ప్రారంభిస్తారు. ముందుకు ఈ నెల 15న ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు అల్పాహార సమావేశంలో భాగంగా బీజేపీ రాష్ట్ర ముఖ్యనేతలతో పలు అంశాలను చర్చిస్తారు. మధ్యాహ్నం 1.10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి భద్రాచలానికి బయల్దేరి వెళతారు.
భద్రాచలం చేరుకున్న తర్వాత మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.20 మధ్యలో రామచంద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత ఖమ్మంలోని ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో బీజేపీ బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. బహిరంగసభ ముగిసిన తర్వాత సాయంత్రం 6 గంటలకు తిరిగి శంషాబాద్‌కు వచ్చి రాత్రి 7 గంటలకు పలువురు నేతలతో వేర్వేరుగా సమావేశమవుతారు. తిరిగి రాత్రి 9.40 గంటలకు శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లిd బయల్దేరి వెళతారు.