హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అన్ని రకాలుగా సిద్దమయింది. మొన్నటి వరకు అభ్యర్థులను ప్రకటించడంలో కసరత్తు చేసిన పార్టీ ఇప్పుడు ఎన్నికల ప్రచారం ద్వారా ప్రజలను ఆకట్టుకోవడం మీద దృష్టి పెట్టింది. ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్‌షాలతో రాష్ట్రంలో భారీ సభలను నిర్వహించింది. మరోమారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఈనెల 17న అమిత్ షా తెలంగాణకు రానున్నారు. రాష్ట్రంలో సుడిగాలి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 17న ఒక్క రోజే నాలుగు మహాసభల్లో అమిత్ షా పాల్గొంటారు.
నల్లగొండ, వరంగల్, గద్వాల్, రాజేంద్రనగర్‌లో నిర్వహించ తలపెట్టిన పబ్లిక్ మీటింగ్స్‌లో అమిత్ షా పాల్గొననున్నారు. అదే రోజు బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను సైతం అమిత్ షా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ పలుమార్లు రాష్ట్రానికి వచ్చి ఎన్నికల ప్రచారం చేపట్టారు. మరోవైపు కేంద్రమంత్రులు, బీజేపీ పెద్దలు ఎన్నికల ప్రచారానికి రానున్నారు. కాగా… ఈ నెల 15న తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి కర్ణాటకకు చెందిన సీనియర్ బీజేపీ నేత, మాజీ మంత్రి బీ. శ్రీరాములు రానున్నారు. గద్వాలలో నిర్వహించే బహిరంగసభలో ఆయన పాల్గొంటారు.