జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల వేల బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోను ఈరోజు (శుక్రవారం) కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా జమ్మూ చేరుకుని పార్టీ తీర్మాన లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370 పునరుద్ధరణను ఆయన తోసిపుచ్చారు. ఆర్టికల్ 370 చరిత్ర అయ్యిందని, అది తిరిగి రాదంటూ ఆయన స్పష్టం చేశారు. జమ్మూ & కాశ్మీర్లో తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని.. తీవ్రవాదానికి బాధ్యత వహించేందుకు శ్వేతపత్రం విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
“ఒకప్పుడు వేర్పాటువాదం, ఆర్టికల్ 370 నీడలో హురియత్ వంటి సంస్థలు ఉండేవి, వివిధ రాష్ట్ర, జాతీయ నాకులు దానిని అస్థిరపరిచేందుకు ప్రయత్నించాయి. గత ప్రభుత్వాలు బుజ్జగించే విధానాలను అవలంభిస్తూ వచ్చాయి. కానీ, 2014-2024 మధ్య జమ్మూకాశ్మీర్ అభివృద్ధి సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్ మా పార్టీకి చాలా ముఖ్యమైనదని మీ అందరికీ తెలుసు. ఈ ప్రాంతాన్ని భారత్తో అనుసంధానం చేయడానికి మేము చాలా ప్రయత్నాలు చేసాము, జమ్మూ కాశ్మీర్ ఎల్లప్పుడూ భారతదేశంలో భాగమేనని, 2014 వరకు ఇక్కడ వేర్పాటువాదం నీడ ఉందని మా పార్టీ నమ్ముతుంది”అని షా అన్నారు.
కాగా, ఆగస్టు 16, 2024 కేంద్ర ఎన్నికల సంఘం జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ను విడుదల చేసింది. మొత్తం మూడు దశల్లో జమ్మూకాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నది. సెప్టెంబర్ 18 తొలి దశ, 25న రెండో దశ, అక్టోబర్ 1న మూడో దశ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. జమ్మూకాశ్మీర్ లో మొత్తం 90 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని ఈసీ ప్రకటించింది. ఫలితాలను అక్టోబర్ 4న విడుదల చేస్తామని చెప్పింది.