హైదరాబాద్,ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ నెల 28, 29 తేదీల్లో అమిత్ షా తెలంగాణ పర్యటన కొనసాగనుంది. పార్టీని రాష్ట్రంలో సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన కార్యాచరణ, వ్యూహంపై షా ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలు, 119 అసెంబ్లి నియోజకవర్గాల్లోని బూత్ కమిటీలు, ఇతర స్థాయి కమిటీల నియామకంపై సమీక్ష నిర్వహించనున్నారు. సంఘ్ నేతలతోనూ అమిత్ షా సమావేశమవుతారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తూ దిశానిర్దేశం చేయనున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్, మంచిర్యాల, జోడేఘాట్‌లలో షా పర్యటించనున్నారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్ నగరంలో భారీ బహిరంగ సభను బీజేపీ నిర్వహించనుంది. పర్యటనలో భాగంగా 28న మంచిర్యాల పట్టణంలో పెద్దపల్లి పార్లమెంట్ బూత్ కమిటీ సభ్యులతో సమావేశం కానున్నారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న అంశంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.