Tuesday, September 17, 2024

TG | 17న రాష్ట్రానికి అమిత్‌షా..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : గ‌త సంవత్సరం మాదిరిగానే ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా, అధికారికంగా నిర్వహించాలని కేంద్రంలోని భాజపా ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర పార్టీ వర్గాలు దృవీకరిస్తున్నాయి. గత ఏడాది కేసీఆర్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించింది.

అయితే ఈ ఏడాది ప్రభుత్వం మారడంతో ఈ విషయంపై స్పష్టత రావడంలేదు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి త్వరలోనే పార్టీ ముఖ్య నేతలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న ప్రాదేశిక ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం అత్యంత కీలకమని కాంగ్రెస్‌ శ్రేణులు చెబుతున్నాయి.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సూచనప్రాయ నిర్ణయం మేరకు ఈ నెల 17న హైదరాబాద్‌ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పాల్గొంటారని పార్టీవర్గాలు తెలిపాయి.

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. రెండేళ్ల క్రితం సెప్టెంబర్‌ 17న పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో అమిత్‌ షా వివిధ పోలీసు దళాల వందన స్వీకరణతో పాటు జాతీయపతాకాన్ని ఎగురవేసిన విషయం తెలిసిందే.

తెలంగాణ విమోచన దినోత్సవంలో అమిత్‌షాతో పాటు- మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఇతర నేతలు పాల్గొననున్నారు. గతేడాది కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో గోల్కొండ ఖిల్లాలో హైదరాబాద్‌ విమోచన వేడుకలను నిర్వహించారు.

- Advertisement -

ఈ ఏడాది మళ్లీ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించే కార్య క్రమానికి అమిత్‌ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన త్వరలోనే బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వివిధ జిల్లాల్లో తలెత్తిన పరిస్థితులపై చర్చించి క్షేత్రస్థాయి పర్యటనలపై నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement