భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన నేపథ్యంలో అగ్రరాజ్యం సాయుధ డ్రోన్ల సరఫరా ఆఫర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కీలక అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. దాదాపు డజను సాయుధ డ్రోన్లు విక్రయించేలా ఈ డీల్ ఉందని వారు వెల్లడించారు. భారత్ కూడా చాలా కాలంగా అమెరికా నుంచి సాయుధ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. కానీ, బ్యూరోక్రటిక్ ఇబ్బందులతో ఈ డీల్ ముందుకు వెళ్లడంలేదు. జూన్ 22న మోడీ శ్వేతసౌధం పర్యటన.. ఈ డీల్‌ను ఓ కొలిక్కి తెస్తుందని అంచనా వేస్తున్నారు.
అమెరికాలో మోదీ పర్యటన ఖరారు కాగానే డ్రోన్ డీల్ విషయంలో పురోగతి చూపించాలని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్, పెంటగాన్ అధికారులు భారత్‌ను కోరారు. దాదాపు 30 ఎంక్యూ9్ఖబి సీ గార్డియన్ డ్రోన్లను విక్రయించాలని భావిస్తోంది. ఈ పర్యటనలో ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మధ్య పలు ఆయుధాల తయారీ, నిర్వహణపై చర్చలు జరగనున్నాయి.
మరోవైపు హై టెక్నాలజీ రంగాలకు సంబంధించిన ఏడు రంగాల్లో భాగస్వామ్యం కోసం భారత్, అమెరికాలు మంగళవారం న్యూదిల్లిలో ఒక మార్గ సూచీని ఆవిష్కరించాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇక్కడ పర్యటిస్తున్న అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. దీనికింద సెమీ కండక్టర్లు, కొత్త తరం టెలికమ్యూనికేషన్, కృత్రిమ మేధ (ఏఐ), రక్షణ రంగాల్లో రెండు దేశాలు సహకరించుకుంటాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో అనేక ద్వైపాక్షిక అంశాల్లో పురోగతి సాధించేందుకు కసరత్తు చేస్తున్నామని జేక్ పేర్కొన్నారు.