అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయగానే వలసలపై కొరడా ఝళిపిస్తామని చేసిన ప్రకటనను నాలుగు రోజుల్లోనే అమల్లో పెట్టేశారు.
ఇవాళ దేశంలోని పలు ప్రాంతాల్లో అక్రమ వలసదారుల్ని అరెస్టులు చేయడం ప్రారంభించారు. వీరిని ప్రత్యేక ఆర్మీ విమానంలో గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారు. . దీంతో మిగిలిన వారికి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.వలసదారులపై ట్రంప్ సర్కార్ ఇవాళ కఠిన చర్యలు ప్రారంభించింది.
ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మూడు రోజుల తర్వాత భారీ ఆపరేషన్ చేపట్టిన అధికారులు.. వందలాది మంది అక్రమ వలసదారులు అరెస్టు చేశారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ దీనిపై స్పందించారు.
అమెరికా అధికారులు 538 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేశారని, సైనిక విమానాన్ని ఉపయోగించి వందల మందిని దేశం నుంచి తరలించినట్లు ప్రకటించారు. అనుమానిత ఉగ్రవాది, ట్రెన్ డి అరగువా ముఠాలోని నలుగురు సభ్యులు, మైనర్లపై లైంగిక నేరాలకు పాల్పడిన అనేక మంది అక్రమార్కులతో సహా 538 మంది అక్రమ వలస నేరస్థులను ఇవాళ అమెరికా ప్రభుత్వం అరెస్టు చేసినట్లు ప్రెస్ సెక్రటరీ వెల్లడించారు.
అమెరికా చరిత్రలోనే అతిపెద్ద వలసల బహిష్కరణ ఆపరేషన్ జోరుగా సాగుతోందని ఆమె తెలిపారు.తమ దేశం సరిహద్దులను రక్షించడానికి ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వైట్ హౌస్ ప్రివ్యూ విడుదల చేసినట్లు ఆమె తెలిపారు. ఇందులో అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అరెస్టు చేసిన కొంతమంది వ్యక్తుల పేర్లు , వారు చేసిన నేరాలను విడుదల చేశారు..
.