Tuesday, September 24, 2024

America – మోడీతో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భేటి

న్యూయార్క్‌: భారత ప్రధాని అమెరికా పర్యటనలో భాగంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ద్వైపాక్షిక భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు భారత్‌ మద్దతును మోదీ పునరుద్ఘాటించారు.

దాదాపు నెల రోజుల వ్యవధిలో జెలెన్‌స్కీ, మోదీల మధ్య ఇది రెండో భేటీ కావడం గమనార్హం. ఇక, జెలెన్‌స్కీతో భేటీ అయినట్లు ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా తెలిపారు. గత నెలలో ఉక్రెయిన్‌ పర్యటన సందర్భంగా ఆ దేశంలో శాంతిస్థాపన అమలుకు భారత్‌ కట్టుబడి ఉందన్నారు. శాశ్వతమైన, శాంతియుతమైన పరిష్కారాన్ని సులభతరం చేయడానికి అన్ని మార్గాల్లో భారత్‌ సిద్ధంగా ఉందన్నారు.

- Advertisement -

‘మేము ఇరుదేశాల సంబంధాలను చురుకుగా అభివృద్ధి చేస్తున్నాం. వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి కలిసి పనిచేస్తున్నాం. అంతర్జాతీయ ఫ్లాట్‌ఫామ్‌లపై ముఖ్యంగా యూఎన్‌, జీ20 సదస్సులలో శాంతి సూత్రాన్ని అమలుచేయడం, రెండో శాంతి శిఖరాగ్ర సమావేశం వంటి పలు అంశాలపై చర్చించాము. అలాగే మన సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు స్పష్టమైన మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు’ అని జెలెన్‌స్కీ తెలిపారు.

గత నెలలో ఉక్రెయిన్‌లో పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా రష్యా- ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఉక్రెయిన్‌లో శాంతిస్థాపనకు భారత్‌ మద్దతుగా నిలుస్తుందని మోదీ పేర్కొన్నారు.

ఇదిలాఉండగా.. ప్రధాని మోదీ ఐరాస సదస్సు అనంతరం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో పాటు ఆర్మేనియా ప్రధాని పాషిన్‌యాన్‌ తదితర నేతలతో ద్వైపాక్షిక భేటీలు నిర్వహించారు. మూడు రోజుల అమెరికా పర్యటనను ముగించుకున్న ప్రధాని మోదీ నేడు భారత్‌కు బయలుదేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement