Friday, January 24, 2025

America – అనుకున్న‌ట్లే వ‌ల‌స‌వాదుల‌పై ఉక్కుపాదం – తొలి రోజే భార‌తీయుల‌కు ట్రంప్ షాక్

జన్మత: పౌరసత్వం రద్దుపై తొలి సంత‌కం
ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు గుడ్ బై
కాలుష్య కంట్రోల్ ఒప్పందానికి పాత‌ర‌
క్యాపిటల్ హిల్ ఖైదీలకు క్ష‌మా భిక్ష‌
మెక్సికో స‌రిహ‌ద్దులు మూసివేత
వ‌ర్క్ ఫ్రం హోం కు చెల్లు చీటి
తొలి రోజే 78 ఆర్డ‌ర్ల‌పై ట్రంప్ ద‌స్త్రం

వాషింగ్ట‌న్ డిసి – ఆంధ్ర‌ప్ర‌భ – అమెరికాలో కొత్త రాజకీయ శకం మొదలైంది. రెండోసారి ప్రెసిడెంట్‌గా ట్రంప్ వచ్చేశారు. అప్పుడు.. ఇప్పుడూ.. ట్రంప్ స్లోగన్ ఏమీ మారలేదు. ఇప్పుడు కూడా మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అంటున్నాడు. ఈసారి మామూలుగా ఉండదనే సంకేతాలిచ్చేశారు తన తొలి ప్ర‌సంగంలోనే . అమెరికా ఫస్ట్ అనే నినాదంతో వచ్చిన ట్రంప్.. తన పాలనా అంశాల్లో అమెరికాకే తొలి ప్రాధాన్యం ఇవ్వబోతున‌ట్లు తేల్చేశారు.

- Advertisement -

అక్రమ వలసలపై ఉక్కుపాదం

అమెరికాను సేఫ్‌గా మార్చేస్తానంటున్నాడు ట్రంప్. వలసలపై దూకుడుగా నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. సరిహద్దుల నుంచి అక్రమంగా ప్రవేశించడాన్ని ఆపేస్తామని.. ఇకపై మన సంపదను మనమే అనుభవిస్తామని ట్రంప్ గట్టిగా చెబుతున్నారు. అక్రమంగా వలస వచ్చిన వేలాది మందిని బలవంతంగా సాగనంపేందుకు అమెరికా చరిత్రలోనే.. భారీ కార్యక్రమం మొదలుపెట్టబోతోంది ట్రంప్ సర్కార్. మన దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకుబోతున్నామన్న ట్రంప్.. అమెరికన్ల బలం, గర్వం, శ్రేయస్సు, గౌరవంతో.. సరికొత్త శకాన్ని ప్రారంభించబోతున్నామనే సందేశం ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను తన హయాంలో నెరవేరుస్తామని మరోసారి డొనాల్డ్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ , ర‌ష్యా యుద్దాన్ని ఆపుతానంటూ కూడా పేర్కొన్నారు ట్రంప్..

తొలి వేటు భార‌తీయుల పైనే..

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన‌ రోజే ఆయన ఏకంగా 78 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేశారు. మన దేశంలో ప్రధానికి ఇలాంటి ఆదేశాలు స్వయంగా జారీ చేసే అధికారం ఉండదు. అమెరికా అధ్యక్షుడికి ఉంటుంది. ఇది ఇలా ఉంటే అమెరికాలోని భారతీయులకు భారీ షాక్ ఇచ్చారు.
ట్రంప్ ప్రమాణ స్వీకారం తరువాత జన్మత: పౌరసత్వం రద్దుపై సంతకం చేశారు. అమెరికాకు వలస వెళ్లిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగానే అమెరికా పౌరసత్వం వస్తుంది. చాలా మంది అమెరికాలో ఉంటూ పెళ్లి చేసుకుంటున్నారు. కొంతమంది గర్భిణీలుగా ఉంటూ.. డెలివరీ అమెరికాలో చేయించుకుంటున్నారు. కొంతమంది టూరిస్ట్ వీసాపై వచ్చి అమెరికాలో డెలివరీ చేయించుకుంటున్నారు. ఇలా ఏదో ఒక విధంగా అమెరికాలో తమ పిల్లలకు పర్మనెంట్ పౌరసత్వం వచ్చేలా చేసుకుంటున్నారు. ఇది గమనించిన ట్రంప్.. దీని వల్ల అమెరికాకి అక్రమంగా వలసలు పెరుగుతున్నాయని అంటున్నారు. ట్రంప్ జారీ చేసింది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కావడం వల్ల ఈ ఆదేశం వెంటనే అమల్లోకి వచ్చేసింది.

భార‌తీయుల‌కు ఎదురుదెబ్బే ….

‘‘అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే జన్మత: పౌరసత్వాన్ని మా ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే.. తల్లిదండ్రుల్లో ఒకరికైనా యూఎస్ సిటిజన్ షిప్, శాశ్వత నివాసి, యూఎస్ మిలిటరీ సభ్యత్వం ఇలా ఏదోక గుర్తింపు ఉండాలని ట్రంప్ నిబంధన విధించారు. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం అమెరికాలోని భారతీయులకు ఇబ్బందికర విషయమనే చెప్పొచ్చు. 2024 గణాంకాల ప్రకారం అమెరికాలో 54లక్షల మంది భారతీయ సంతతికి చెందిన వారు ఉన్నారు. యూఎస్ జనాభాలో 1.47శాతం మంది వారే ఉండటం గమనార్హం.

అమెరికాలో విద్య, వైద్యం, ఐటీ రంగాల్లో రాణిస్తున్న భారతీయులు ఉన్నారు. ఉద్యోగాలు, విద్యావకాశాలు, వ్యాపారాలకోసం వెళ్లినవారు ఉన్నారు. ప్రస్తుతం ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని అదిరోహించడంతో హెచ్1బీ, ఎఫ్1 వీసాలు, గ్రీన్ కార్డులపై భారతీయుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. గతంలో ప్రధాని నరేంద్ర మోదీతో డొనాల్డ్ ట్రంప్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే, ఈసారి భారతదేశం పట్ల ట్రంప్ వ్యవహారశైలి ఎలాఉంటుంది..? నరేంద్ర మోదీతో ఆయన సంబంధాలు గతంలోలానే కొనసాగుతాయా.. అనే అంశాలనుబట్టి భారత్ పై డొనాల్డ్ ట్రంప్ ప్రభావం ఏమేరకు ఉంటుందనేది రాబోయే కాలంలో తెలుస్తుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థకు గుడ్ బై..

  • ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలగింది. ఇక ఆమెరికా ఈ సంస్థ‌లోలో భాగం కాదు. దానికి విరాళాలు ఇవ్వదు.
  • పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకుంది. ఇక అమెరికాలో కాలుష్యంపై కంట్రోల్ ఉండకపోవచ్చు.
  • క్యాపిటల్ హిల్‌పై దాడి చేసిన 1500 మంది ఖైదీలకు క్షమాభిక్ష. ఒకప్పుడు ట్రంప్ ఆదేశాలతోనే వారు దాడి చేశారని టాక్.
  • బైడెన్ తీసుకున్న నిర్ణయాలను రద్దు చేసిన ట్రంప్. ఫెడరల్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ రద్దు. 24 గంటలూ ఫెడరల్ ఉద్యోగులు ఆఫీసుల్లో ఉండేలా ఆర్డర్.
  • అమెరికా దక్షిణ భాగంలో నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తూ ఆర్డర్. ఇక మెక్సికో సరిహద్దుల్లో చొరబాట్లపై భారీ చర్యలు.
  • మెక్సికో, అమెరికా స‌రిహ‌ద్దుల‌లో భారీగా సైన్యం మొహ‌రింపు.. స‌రైన ప‌త్రాలు లేకుంటే నో ఎంట్రీ

Advertisement

తాజా వార్తలు

Advertisement