అమెరికాలో తీవ్ర విషాదం నెలకొంది. మసాచుసెట్స్ రాష్ట్రంలోని డోవర్లో నివాసముంటున్న ఓ సంపన్న భారత సంతతి కుటుంబ సభ్యులు మృతి చెందారు. రాకేశ్ కమల్ (57), ఆయన భార్య టీనా (54), కుమార్తె ఆరియానా (18) మృతదేహాలను గురువారం సాయంత్రం వారి ఇంట్లోనే గుర్తించారు. దీంతో తీవ్ర కలకలం రేగింది. 11 బెడ్రూమ్లు, 19,000 చదరపు అడుగులలో నిర్మించిన 54.5 లక్షల డాలర్ల (సుమారు రూ.46 కోట్లు) విలువైన భవనంలో వారి మృతదేహాలను గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వారి కుటుంబానికి బంధువైన ఓ వ్యక్తి మూడు రోజులుగా ఫోన్ చేస్తున్నా ఎలాంటి స్పందనా లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ విషాదం వెలుగుచూసింది. రాకేశ్, టీనాలు ఇద్దరూ విద్యావంతులే కావడంతో వారికున్న అనుభవంతో 2016లో ఎడ్యునోవా అనే ఆన్లైన్ ఎడ్యుకేషన్ కంపెనీని ప్రారంభించారు. ఈ సంస్థకు నష్టాలు వచ్చి 2021 డిసెంబరులో మూతపడింది. అప్పటి నుంచి వారికి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దంపతులు దివాలా కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ అది తిరస్కరణకు గురయ్యింది. సరైన పత్రాలు లేవంటూ దాన్ని తిరస్కరించారు. దిక్కుతోచని స్థితిలో అత్యంత ఖరీదైన ఇంటిని సగం ధరకే విక్రయించారని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.