అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టు అయ్యారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఫలితాల్లో జోక్యం, కుట్ర, అక్రమాలు లాంటి డజనుకు పైగా క్రిమినల్ కేసులు నమోదైన నేపథ్యంలో పోలీసుల ముందు ట్రంప్ లొంగిపోయారు.అట్లాంటా ఫుల్టన్ కౌంటీ జైలు వద్ద పోలీసుల ఎదుట ఆయన లొంగిపోయారు. ఇందుకు సంబందించిన మగ్ షాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఫుల్టన్ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోవడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. జైలులో 20 నిమిషాల పాటు గడిపారు. ఆపై రెండు లక్షల డాలర్ల విలువైన బాండ్‌ను సమర్పించి బెయిల్‌పై విడుదల అయ్యారు.
ట్రంప్‌పై నమోదైన నాలుగు క్రిమినల్ కేసుల్లో ఇది ఒకటి. ఇలాంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు స్వయంగా పోలీసులు ఎదుట లొంగిపోయినా.. దాన్ని అరెస్ట్ కిందే పరిగణిస్తారు
స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం రాత్రి 7 గంటలకు డొనాల్డ్ ట్రంప్ ఆట్లాంటాకు వెళ్లారు. అరెస్ట్, విడుదలకు సంబంధించిన ప్రక్రియ 20 నిమిషాల్లోనే ముగిసింది. జైలు అధికారులు ఆయనకు సంబంధించి వివరాలు తీసుకున్నారు. 77 ఏళ్ల ట్రంప్.. 6 ఫీట్ 3 ఇంచ్‌ల హైట్, 215 పౌండ్ల బరువు ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా జైలు అధికారులు ఆయనను ఫొటోలు దింపారు. నాలుగు నగరాల్లో అనేక కేసులు నమోదవడంతో ట్రంప్ గత మార్చి నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు