వాషింగ్టన్ డి సి: అమెరికా అధ్యక్షుడికి విశేష అధికారాలు ఉంటాయి. వాటిని ఉపయోగించుకొని.. ఒక్కోసారి సంచలన నిర్ణయాలు తీసుకుంటారు. ఐతే.. ఇండియాలో లాగానే.. అమెరికాలో కూడా న్యాయవ్యవస్థ బలంగా ఉంటుంది.
పాలకులు విపరీత నిర్ణయాలు తీసుకుంటే.. కొన్ని సందర్భాల్లో కోర్టులు బ్రేక్ వెయ్యగలవు. ఇప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో అదే జరిగింది. అమెరికాకు వలస వచ్చిన వారికి అమెరికాలో పిల్లలు పుడితే.. వారికి పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం వచ్చే హక్కును రద్దు చేస్తూ.. ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సియాటెల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఇది రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం అని జడ్జి తెలిపారు.
ఇటీవల జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత 200 కార్యనిర్వాహక ఆదేశాలను ట్రంప్ జారీ చేశారు. వాటిలో అమెరికాకి వలస వచ్చే వారికి అమెరికాలో పిల్లలు పుడితే.. ఆ పిల్లలకు పుట్టగానే అమెరికా పౌరసత్వం వచ్చేస్తుందనే హక్కును రద్దు చేసిన ఆదేశం కూడా ఉంది. ఇది ఫిబ్రవరి 20, 2025 తర్వాత అమల్లోకి వస్తుందని తెలిపారు.
న్యాయపోరాటం:ట్రంప్ ఆదేశాన్ని వ్యతిరేకిస్తూ ఇల్లినాయిస్, వాషింగ్టన్, అరిజోనా, ఒరెగాన్ రాష్ట్రాల్లోని ప్రతిపక్ష డెమెక్రాట్ల బృందాలు సియాటెల్ ఫెడరల్ కోర్టుకు వెళ్లాయి. అమెరికా రాజ్యాంగం లోని 14వ సవరణ ప్రకారం.. పుట్టిన వెంటనే పౌరసత్వం వస్తుందనీ, అందుకు విరుద్ధంగా ట్రంప్ ఆదేశం ఉంది అని కోర్టులో ప్రతిపక్షం తరపు లాయర్లు వాదించారు. అమెరికాలో పుట్టిన ఎవరికైనా పౌరసత్వం లభిస్తుందని తెలిపారు.
ట్రంప్ తీసుకున్నది కీలకమైన, వివాదాస్పద నిర్ణయం కావడంతో.. సియాటెల్ డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ కాఫ్నర్, ట్రంప్ ఆదేశాల్ని తాత్కాలికంగా ఆపేస్తూ తీర్పు ఇచ్చారు. 22 రాష్ట్రాలు, కొన్ని సివిల్ సంఘాలు కూడా ఈ అంశంపై కోర్టుకు వెళ్లాయి.
భారీగా జననాలు:
మరోవైపు అమెరికాకి వలస వచ్చిన వారు.. వెంటనే పిల్లల్ని కనేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 20లోపే పిల్లలు పుట్టేలా.. సిజేరియన్ ఆపరేషన్స్ చేయించుకోవడానికి కూడా రెడీ అవుతున్నారు. 9 నెలలు నిండకపోయినా.. బలవంతంగా కనేసేందుకు రెడీ అవుతున్నారు. పిల్లలు వేగంగా పెరగడానికి ఏయే ఆహారాలు తీసుకోవాలో, అవి ఇప్పుడు గబగబా తీసుకుంటున్నారు. తద్వారా త్వరగా పిల్లలు పుట్టినా, వారికి శారీరకంగా, మానసికంగా సమస్య రాదు అనుకుంటున్నారు. ఇలా ట్రంప్ తీసుకున్న నిర్ణయం లక్షల మంది జీవితాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.