అమెరికాలోని వాషింగ్టన్లో 60 మంది ప్రయాణికులు, నలుగురు క్రూ సిబ్బంది తో వెళ్తున్న ఓ విమానం.. మరో హెలికాప్టర్‌ను ఢికొట్టింది. దీంతో రెండూ పక్కనే ఉన్న పోటోమాటిక్ నదిలో కూలిపోయాయి. బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో వాషింగ్టన్ సమీపంలోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ఇప్పటి వరకు 18 మంది మరణించారు.. మరికొందర్ని రక్షించి చికిత్స కోసం హాస్పటల్ కు తరలించారు.. సహాయ కార్యక్రమాలను అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
పీఎస్ఏ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో కాన్సాస్‌లోని విషిటా నుంచి బయల్దేరింది. రోనాల్డ్ రీగన్ ఎయిర్‌పోర్టులో దిగేందుకు సిద్ధమవుతుండగా.. రక్షణ శాఖకు చెందిన సికోర్స్కీ హెచ్-60 బ్లాక్‌హాక్ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. దీంతో భారీ శబ్ధంతో అవి రెండూ నదిలో కుప్పకూలాయి.
అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆ విమానాన్ని పీఎస్ఏ నిర్వహిస్తున్నది. సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రయాణికుల కోసం నదిలో గాలిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదం కారణంగా రోనాల్డ్ రీగన్ విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. విమానాల రాకపోకలు నిలిపివేశారు.