కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న వేళ డెల్టా వేరియంట్ ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. అయితే ఆ వైరస్ వేరియంట్ చికెన్ పాక్స్ కంటే ప్రమాదకరమన్న సంకేతాలను అమెరికా వినిపించింది. అగ్రరాజ్యానికి చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఈ విషయాన్ని తెలిపింది. కరోనా వైరస్‌కు చెందిన డెల్టా వేరియంట్ చాలా ప్రమాదకరరీతిలో విస్తరిస్తోందని, వ్యాక్సిన్ల రక్షణ వలయాన్ని కూడా అది చేధించగలదని, దాని ద్వారా మరింత విధ్వంసకరమైన వ్యాధి సోకే ప్రమాదం ఉన్నట్లు సీడీసీ చెప్పింది.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి డెల్టా వేరియంట్ సోకితే, అలాంటివారి ముక్కు, గొంతులో ఎంత వైరస్ ఉంటుందో.. వ్యాక్సిన్ తీసుకోని వారిలో కూడా అంతే వైరల్ లోడ్ ఉంటుందని సీడీసీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. మెర్స్, సార్స్, ఎబోలా, కామన్ కోల్డ్, సీజనల్ ఫ్లూ, స్మాల్ పాక్స్ వైరస్‌ల కన్నా డెల్టా వేరియంట్ వేగంగా విస్తరిస్తుందని వారు తెలిపారు. అయితే డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరమైన చికెన్‌పాక్స్ వ్యాధి కన్నా ఎక్కువ స్థాయిలో వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నట్లు సీడీసీ తన నివేదికలో తెలిపింది. డెల్టా వేరియంట్ కేసులకు సంబంధించిన కొత్త డేటా ఇప్పుడిప్పుడే వస్తోందని, కానీ ఆ డేటాలో ఉన్న అంశాలు కలవరపెడుతున్నాయని సీడీసీ పేర్కొంది.
మరోవైపు గురువారం అమెరికాలో కొత్తగా 71వేల పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కొత్త డేటా ప్రకారం వ్యాక్సిన్ తీసుకున్నవారి వల్ల వైరస్ వ్యాప్తి అవుతున్నట్లు తేలింది. డెల్టా వేరియంట్ సోకిన వారిలో ఇతర కేసులతో పోలిస్తే వైరల్ లోడ్ అధికంగా ఉన్నట్లు తేలింది. ఈ డేటా ఆధారంగానే మాస్క్ పెట్టుకోవాలని మళ్లీ ఆదేశాలు జారీ చేసినట్లు సీడీసీ ఏజెన్సీ తెలిపింది. ఆల్ఫా వేరియంట్ సోకిన వారు గాలిలోకి వదిలే వైరస్ లోడ్ కన్నా.. డెల్టా వేరియంట్‌తో గాలిలోకి విడుదలయ్యే వైరల్ లోడ్ పది రేట్లు ఎక్కువగా ఉన్నట్లు సీడీసీ అంచనా వేసింది.
ఈ వార్త కూడా చదవండి: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా ఉధృతి