అమెరికా లోని లూసియానా రాష్ట్రంలో పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదం ఇంటర్‌స్టేట్-55 రహదారిపై జరిగింది. దాదాపు 158పైగా వాహనాలు పరస్పరం వేగంగా ఢీకొన్నాయి. అనంతరం మంటలు చెలరేగాయి. న్యూ ఓర్లానో సమీపంలోని పాంట్ చార్ట్రెయిన్ సమీపంలో ఘటనా స్థలంలో కార్లు, భారీ వాహనాలు కుప్పలు తెప్పలుగా పడిఉన్నాయి. దాదాపు 30 నిమిషాలపాటు వాహనాలు ఢీకొనడం కొనసాగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఒక కారు ఏకంగా వంతెన పై నుంచి నీటిలో పడినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంతో దాదాపు 11 మైళ్ల మేరకు ఈ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఈ ఘటనా స్థలానికి భారీ ఎత్తున సహాయక బృందాలు చేరుకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా.. 25 మందికిపైగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఫొటోలను లూసియానా పోలీసులు ఏరియల్ షాట్లను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.