కెనడా పార్లమెంట్ బయట భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆర్య హిందూ జెండాను ఎగురవేశారు. నవంబర్‌లో ‘హిందూ హెరిటేజ్ మంత్’ను పురస్కరించుకొని హిందూ పతాకాన్ని రెపరెపలాడించారు. ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్న హిందూ కెనడియన్లు రాజకీయాల్లో భాగం కావాలని పిలుపునిచ్చారు.
ఈ రంగంలో మన ప్రాతినిధ్యం తగిన స్థాయిలో లేదని విచారం వ్యక్తం చేశారు. కెనడాలో హిందువుల శకం ప్రారంభమైందని చెప్పిన చంద్ర ఆర్య.. విద్యావంతులైన, విజయవంతమైన కమ్యూనిటీ-ల్లో మనం ఒకటిగా ఉండి ఇక్కడి సమాజం, ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతున్నామన్నారు.
మిగతా రంగాల్లో మన ప్రాతినిధ్యం మెరుగ్గానే ఉన్నప్పటికీ రాజకీయంగా మాత్రం ఆశించిన స్థాయిలో లేనందున ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం కావాలని పిలుపునిస్తున్నా అని ఎక్స్ వేదికగా చంద్ర ఆర్య తెలిపారు. కాషాయ రంగులో ఉన్న ఈ జెండాపై ఓం అనే అక్షరాలు ఉన్నాయి. గత మూడేళ్లుగా ఇక్కడే జెండాను చంద్ర ఆర్య ఎగురవేస్తుండటం గమనార్హం.