న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వెయ్యేళ్ల దూరదృష్టితో భారత రాజ్యాంగం రాసిన డా. బి.ఆర్. అంబేద్కర్ ప్రతి మనిషికి వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చారని, ఆ బలమే భారత్‌కు బలగమై వెలుగుతోందని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డా. మందా జగన్నాథం హర్షం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన డా. బాబా సాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రెసిడెంట్ కమిషనర్ డా. గౌరవ్ ఉప్పల్‌తో కలిసి భవన్ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహానికి జగన్నాథం పూలమాల వేశారు.
అనంతరం అంబేద్కర్ ఆడిటోరియంలో అధికారులు, సిబ్బందితో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మందా జగన్నాథం మాట్లాడుతూ “డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా భారతీయులకు సుపరిచితులని గుర్తు చేశారు. చరిత్ర ఉన్నంతకాలం ఆయన పేరు పదిలంగా ఉంటుందన్నారు. అంటరానితనంపై ఆయన పూరించిన సమరశంఖం నేటికీ ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతూనే ఉందని మందా జగన్నాథం చెప్పుకొచ్చారు.
కుల, మత రహిత ఆధునిక భారతం కోసం అంబేద్కర్ తన జీవితకాలం పోరాటం చేశారని కొనియాడారు. ఆయన జయంతిని తెలంగాణ ప్రభుత్వం పండుగలా చేస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దళితుల సంక్షేమానికి నిలువెత్తు నిదర్శనమే 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహమని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను అమల్లోకి తీసుకువచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం దళితాభివృద్ధి కోసం కృషి చేస్తోందని జగన్నాథం చెప్పారు.