న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్-తెలంగాణ భవన్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇరు భవన్ల ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్, అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్, స్పెషల్ కమిషనర్ యన్.వి. రమణారెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, ఇరు భవన్ల సిబ్బంది, పోలీసులు అధికారులు, పలు స్వచ్చంద సంస్థలు ఉత్సవాల్లో పాల్గొన్నాయి.
కన్నులపండువగా జరిగిన వేడుకలకు పెద్దసంఖ్యలో జనం తరలివచ్చారు. ముందుగా కమిషనర్లు జ్యోతి ప్రజ్వలన గావించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. మాజీ ఎంపీఏజేవీ మహేశ్వరరావు కూడా అంబేద్కర్‌కు నివాళులర్పించారు. బాబాసాహెబ్ రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని, సమానత్వం కోసం శ్రమించారని వారంతా కొనియాడారు. తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రికి చెందిన చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.