రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి, మర్చంట్ వారసురాలైన రాధికా మర్చంట్‌కు గురువారం నిశ్చితార్థం జరిగింది. రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలో ఉన్న శ్రీనాథ్‌జీ ఆలయంలో ఈ వేడుక ఘనంగాజరిగింది. రెండు కుటుంబాలకు చెందిన బంధువులు, సన్నిహితులు ఈ వేడుకకు హాజరయ్యారు. మర్చంట్ కుటుంబానికి, అంబానీ కుటుంబంతో స్నేహపూర్వక సంబంధాలున్నాయి. ఇదే అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల మధ్య ప్రేమకు దారితీసింది. అంబానీ ఇంట జరిగే ప్రతి కార్యక్రమంలోనూ రాధిక పాల్గొంటూ అందరి దృష్టినీ ఆకర్షించేది. ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరు చివరకు వివాహ బంధంతో ఒక్కటికాబోతున్నారు. వీరిద్దరు వారివారి కుటుంబాలకు చెందిన వ్యాపారాల్లో చురుగ్గా ఉన్నారు.
అనంత్ అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు. బ్రౌన్ విశ్వవిద్యాలయం నుంచి పట్టా పొందిన ఆయన, తర్వాత నుంచి రిలయన్స్‌లోని జియో, రిటైల్ వెంచర్స్ బోర్డుల్లో సభ్యుడిగా, వివిధ హోదాల్లో సేవలు అందించారు. ప్రస్తుతం ఈ సంస్థలోని ఎనర్జీ బిజినెస్‌కు నేతృత్వం వహిస్తున్నారు. కాగా, మర్చంట్ శైలా, వీరేన్ మర్చంట్‌ల కుమార్తె రాధిక. న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. న్యూయార్క్ యూనివర్సిటీలో పాలిటిక్స్, ఎకనమిక్స్ విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసింది. రాధికకు శాస్త్రీయ నృత్యం అంటే ఇష్టం. ఈ మక్కువతోనే ప్రముఖ డ్యాన్సర్ భావనా థాకర్ వద్ద భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. ప్రస్తుతం ఎన్‌కోర్ హెల్త్‌కేర్ బోర్డు డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.