ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఉద్యోగాల కోతను కొనసాగిస్తోంది. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే 18వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అస్థిర ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని వివరించింది. మా సహచరులలో ఒకరు సమాచారాన్ని లీక్ చేయడంతో అకస్మాత్తుగా ప్రకటన చేయడం జరిగిందని కంపెనీ సీఈవో ఆండీ జస్సీ చెప్పారు. వాస్తవానికి రెండు నెలల కిందటే ఉద్యోగాలకోతపై అమెజాన్ ప్రకటన చేసింది. అప్పట్లో కొంతమందిని తొలగించింది. ఉద్వాసన ప్రక్రియ మరికొన్ని నెలలు కొనసాగుతుందని కూడా చెప్పింది. అన్నివిభాగాల్లో లోతైన సమీక్ష జరిపి పునర్‌వ్యవస్థీకరణ అవసరమైన చోట ఉద్యోగుల తొలగింపు ఉంటుందని వెల్లడించింది. కరోనా సమయంలో డిమాండ్‌కు అనుగుణంగా భారీ సంఖ్యలో నియామకాలు జరిగాయి. 2020 నుంచి2022 మధ్యలో సిబ్బంది సంఖ్య దాదాపు రెట్టింపైంది.
ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో వ్యాపారం నెమ్మదించింది. దీంతో వ్యయ నియంత్రణ చర్యలు అనివార్యం అయ్యాయి. అందులో భాగంగానే ఉద్యోగుల తొలగింపు చేపట్టాల్సి వచ్చింది. ఉద్వాసనకు గురైన వారికి తమవంతు సహకారం అందిస్తాం. ప్రత్యేక ప్యాకేజీ, బీమా ప్రయోజనాలు కల్పిస్తాం అని అమెజాన్ సీఈవో జస్సీ తెలిపారు. సెప్టెంబర్ నాటికి ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలో 15.4 లక్షల మంది పనిచేస్తున్నారు. తాజా తొలగింపు నిర్ణయంతో భారతీయులు కూడా ప్రభావితం కానున్నారు. ఇండియాలో దాదాపు 10వేల మంది అమెజాన్‌కు సేవలు అందిస్తున్నారు.
సేల్స్‌ఫోర్స్‌లో 8000 మందిపై వేటు..
బిజినెస్ సాఫ్ట్‌వేర్ సంస్థ సేల్స్‌ఫోర్స్ సైతం ఉద్యోగులను తొలగించింది. సుమారు 8000 మందిని ఇంటికి పంపుతున్నట్లు ప్రకటించింది. కంపెనీ మొత్తం సిబ్బందిలో ఇది 10శాతం. కంపెనీ ప్రారంభించాక ఇంతపెద్ద సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేయడం ఇదే తొలిసారి. ఉద్యాసనకు గురైన ఉద్యోగులకు ఐదు నెలల వేతనంతోపాటు ఆరోగ్యబీమా, కొత్త ఉపాధి ఏర్పాటుకు సహకారం అందిస్తామని కంపెనీ ప్రకటించింది. కరోనా సంక్షోభంలో అనూహ్య డిమాండ్ కారణంగా భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని నియమించుకోవాల్సి వచ్చిందని సేల్స్‌ఫోర్స్ తెలిపింది. తాజా తొలగింపులకు తానే పూర్తి బాధ్యత వహిస్తున్నానని కంపెనీ సీఈవో మార్క్ బెనియాఫ్ తెలిపారు.