వ్యయాలు తగ్గించుకునేందుకు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న అమెజాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాలో ఎడ్‌టెక్ బిజినెస్‌ను మూసివేస్తున్నట్లు గురువారం నాడు ప్రకటించింది. ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌ను స్కూల్ విద్యార్ధుల కోసం ప్రారంభించింది. గత సంవత్సరం అమెజాన్ అకాడమీ పేరుతో దీన్ని ప్రారంభించింది. జేఈఈ వంటి పోటీ పరీక్షలకు కూడా కోచింగ్ ఇస్తోంది. 2023 ఆగస్టు నుంచి మూసివేత ప్రారంభం అవుతుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ విద్యా సంవత్సరంలో ఎన్‌రోల్ చేసుకున్న వారికి పూర్తి ఫీజు రిఫండ్ చేస్తామని ప్రకటించింది. విద్యార్ధులకు ఇబ్బంది లేకుండా అమెజాన్ అకాడమీ సెంటర్లను దశలవారిగా మూసివేస్తామని తెలిపింది.
మన దేశంలో ఎడ్‌టెక్ రంగంలో తీవ్ర పోటీ ఉంది. ప్రస్తుతం బైజూస్, అన్‌అకాడమీ వంటి సంస్థలు అగ్రస్థానంలో ఉన్నాయి. అమెజాన్ అకాడమీ ఈ రంగంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఆన్‌లైన్‌లో కోర్సు మెటిరీయల్ 2024 అక్టోబర్‌కు అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. కరోనా అదుపులోకి రావడంతో అన్ని విద్యాసంస్థలు నడుస్తున్నాయి. దీంతో ఆన్‌లైన్ విద్యను అందిస్తున్న పలు సంస్థలు అచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న బై జూస్ 2,500 మంది ఉద్యోగులను తొలగించింది. అన్‌అకాడమీ, వైట్‌హ్యాట్ వంటి సంస్థలు కూడా ఉద్యోగులను తొలగించాయి.
ఉద్యోగులకు ఆఫర్
ఇప్పటికే 10 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించిన అమెజాన్, 2023లోనూ ఉద్యోగాల తొలగింపు ఉంటుందని తెలిపింది. స్వచ్ఛందంగా రాజీనామా చేసి, వేతన సంబంధిత ప్రయోజనాలు తీసుకుని వెళ్లిపోవాలని కొందరు భారతీయ ఉద్యోగులకు అమెజాన్ కోరిందని తెల్సింది. సంస్థనే కాంట్రాక్ట్ రద్దు చేసేబదులు, స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కోరడంతో, చాలా మంది ఉద్యోగులు దీనివైపే మొగ్గు చూపుతున్నారు. దీనికి సానుకూలంగా ఉన్న వారు నవంబర్ 30 నాటికి సంతకం చేయాలని అమెజాన్ కోరింది. కంపెనీ విధించిన గడువులోగా సంతకాలు చేసిన ఉద్యోగులకు వేతన ప్రయోజనాలు అందిస్తామని తెలిపింది. ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే చట్ట
ప్రకారం తొలగింపును సవాల్ చేసే అవకాశం ఉండదు.
అమెజాన్ సంస్థ ఉద్యోగుల తొలగింపుపై కార్మిక శాఖకు ఫిర్యాదులు వెళ్లడంతో కార్మిక శాఖ నోటీస్‌లు జారీ చేసింది. దీనిపై వివరణ అడిగింది. ఇప్పుడు ఈ స్కీమ్ పెట్టి, ఉద్యోగులను తొలగించాలని ఆమెజాన్ నిర్ణయించింది. తొలగింపు బదులు, రాజీనామా రూట్‌లో ఉద్యోగులను ఇంటికి పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది.