Thursday, November 21, 2024

టెలీమెడిసన్‌కు అద్భుత స్పందన.. డిజిటలైజేషన్‌ దిశగా దూసుకెళుతున్న వైద్యరంగం

అమరావతి, ఆంధ్రప్రభ: డాక్టర్‌ గారు.. నాలుగు రోజుల నుంచి తీవ్ర జ్వరం, దగ్గుతో బాధ పడుతున్నా. షుగర్‌, బీపీ కూడా ఉన్నాయి. కాస్తంత త్వరగా నయం అయ్యేలా మంచి మందులు ఇవ్వండి సారూ.. పీహెచ్‌సీ నుంచి ఓ పెద్దాయన హబ్‌లోని డాక్టర్‌తో మాట్లాడిన మాటలివి. ఆరోగ్య పరిస్థితిపై సమగ్రంగా ఆరా తీసిన డాక్టర్‌ ఆన్‌లైన్లోనే ప్రి స్క్రిప్షన్‌ ఇచ్చారు. ఆ మేరకు వైద్య సిబ్బంది మందులు అందించారు. టెలీమెడిసన్‌ సర్వీసులకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. రోజుకు 60 వేల కాల్స్‌ వస్తున్నాయంటే టెలీమెడిసన్‌ విధానంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందన్న విషయం స్పష్టమవుతోంది. గ్రామ స్థాయిలో -టె-లి మెడిసిన్‌ సేవలను విస్తృతం చేస్తోంది. 6500 టెలీమెడిసిన్‌ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్రామస్థాయిలో వారు అక్కడి వైద్యులను, తీవ్రమైన అనారోగ్య సమస్యల కోసం జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన హబ్‌లో వున్న స్పెషలిస్టు వైద్యులను సంప్రదించి సలహా సూచనలందుకునే వెసులుబాటు కల్పించారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే ఎంఎల్‌ హెచ్‌ పిలు, ఎఎన్‌ఎంలు వారిని వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ఎంపానెల్డ్‌ ఆస్పత్రులకు రిఫర్‌ చేసి అక్కడికి తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

రాష్ట్రంలో వైద్య సేవల్ని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. 16 కొత్త మెడికల్‌ కళాశాలల ఏర్పాటుతో పాటు నాడు – నేడు ద్వారా వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ఇందులో భాగంగా డిజిటల్‌ వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తెస్తోంది. టెలీమెడిసన్‌ సేవల్ని విస్తృతం చేస్తోంది. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో 2019లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ-సంజీవని పేరుతో టెలిమెడిసన్‌ సేవలకు శ్రీకారం చుట్టారు. కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం టెలీమెడిసన్‌ సేవలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించింది.

- Advertisement -


టెలీమెడిసన్‌ సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. 27 హబ్స్‌ను ఏర్పాటు చేసి రాష్ట్రంలోని 1,145 పీహెచ్‌సీలు, 560 సీహెచ్‌సీలు విలేజ్‌ క్లినిక్స్‌కు అనుసంధానం చేసింది. ఒక్కో హబ్‌లో ఇద్దరు జనరల్‌ మెడిసన్‌, గైనకాలజిస్ట్‌, పీడియాట్రిక్స్‌, కార్డియాలజీ నిపుణుల్ని ఏర్పాటు చేసింది. పీహెచ్‌సీలు, విలేజ్‌ క్లినిక్స్‌ కు వ చ్చే రోగులకు ప్రత్యేక వైద్యం అవసరం అయితే అక్కడున్న సిబ్బంది టెలీమెడిసన్‌ ద్వారా హబ్‌లో ఉన్న స్పెషలిస్ట్‌లను సంప్రదిస్తారు. వెంటనే స్పెషలిస్ట్స్ ఆడియో, వీడియో కాల్‌ ద్వారా రోగులతో మాట్లాడి వారికి చికిత్స అందిస్తారు. ఆరోగ్యపరమైన సలహాలు, సూచనలతో పాటు ప్రిస్క్రిప్షన్‌ ఇస్తారు. ఈమేరకు మందుల్ని వైద్య సిబ్బంది అందిస్తారు. స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న వాళ్ళు నేరుగా ఇంటి నుంచే ఈ-సంజీవనీ యాప్‌ ద్వారా టెలీమెడిసన్‌ సేవల్ని పొందవచ్చు. స్మార్ట్‌ ఫోన్‌ లేని వారి కోసం వారికి ఇంటి వద్దే ఈ సంజీవని వైద్య సేవలు అందించడం కోసం 42 వేల మంది ఆశా వర్కర్లకు ప్రభుత్వం స్మార్ట్‌ ఫోన్లను అందించింది. వీటన్నింటినీ హబ్‌లకు అనుసంధానించి వైద్య సే వలు అందిస్తున్నారు. టెలీమెడిసన్‌ వైద్య సేవల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో నిలిచింది.

డిజిటలైజేషన్‌

కేంద్ర ప్రభుత్వం ప్రతి 5వేల మంది జనాభాకు ఒక సబ్‌ సెంటర్‌ అందుబాటు-లో ఉండాలనే విధానాన్ని అనుసరిస్తుండగా వైసీపీ ప్రభుత్వం ప్రతి 2వేల జనాభాకు ఒక ఒకటి చొప్పున హెల్త్‌ క్లినిక్‌ ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ప్రాథమిక ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు రూ.2750 కోట్లు- ఖర్చు చేస్తోంది. సెకండరీ వైద్య విభాగం బలోపేతం కోసం రూ.1223 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆరోగ్య వివరాలను డిజిటలైజేషన్‌ చేయడం వల్ల ఫ్యామిలీ డాక్టర్లకు సమగ్ర సమాచారం అందే వీలుంటుందని భావించిన ప్రభుత్వం ఆ దిశగా ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది ఉగాది నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ల విధానం అమలయ్యేలా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. పిహెచ్‌ సిలో వున్న ఇద్దరు వైద్యులకు ఆ పరిధిలోని ప్రతి గ్రామ సచివాలయాన్ని మ్యాపింగ్‌ చేయటం జరుగుతుంది. వారు తమకు నిర్దేశించిన గ్రామాలను సందర్శించి అక్కడ వైద్య సేవలందిస్తారన్నారు.

ఒక వైద్యుడు ఎంఎంయులో గ్రామాలను సందర్శించి వైద్యసేవలందిస్తుంటే మరొకరు పిహెచ్‌ సికి వచ్చే వారికి వైద్య సేవలందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మ్యాపింగ్‌ చేసిన గ్రామాల్లో వైద్యులు శాశ్వత ప్రాతిపదికపై నెలలో రెండు రోజులు సేవలు అందించనున్నారు. ఈ మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌లు ఒక గ్రామాన్ని నెలలో రెండు సార్లు సందర్శించే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఫ్యామిలీ డాక్టర్ల విధానాన్ని అమలు చేయడం ద్వారా 80 శాతం మేర ఆరోగ్య సమస్యలకు గ్రామస్థాయిలోనే పరిష్కారమందించాలన్నది ప్రభుత్వ ఆలోచన. తద్వారా జిల్లాస్థాయి ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గించి నాణ్యమైన వైద్యం అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement