న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాజధానిని విశాఖకు తరలింపు అనేది జరగని పని అని అమరావతి జేఏసీ స్పష్టం చేసింది. ఏపీకి అమరావతే ఏకైక రాజధాని అని నొక్కి చెప్పింది. అమరావతి పరిరక్షణ సమితి జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు జీవీఆర్ శాస్త్రి, అమరావతి జేఏసీ నాయకులు వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ బుధవారం న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఏపీ రాజధానిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇచ్చిన సమాధానం చాలా కీలకమైనదని జీవీఆర్ శాస్త్రి చెప్పుకొచ్చారు. రాజధాని విషయంలో బీజేపీ పెద్దలు, ఆర్ఎస్ఎస్ నేతలు ఎంతగానో సహకరిస్తున్నారని అన్నారు.
తొందరలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా రాజధానిపై సవివరమైన ప్రకటన చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖకు వెళ్లిపోతామని సీఎం ప్రకటన చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి అమరావతిలో నిలిచిపోయిన అభివృద్ధి, ఆర్థిక కార్యక్రమాలని పూర్తి చేయాలని సూచించారు. అనంతరం వెలగపూడి గోపాలకృష్ణ మాట్లాడుతూ… హోంశాఖ సహాయ మంత్రి ఇచ్చిన సమాధానం ఎంతో ఊరటనిచ్చే అంశమని సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి సరైన సమాధానం చెప్పారన్నారు. అమరావతి రైతుల త్యాగానికి త్వరలోనే ప్రతిఫలం సిద్ధిస్తుందని ఆయన చెప్పారు. పార్లమెంట్‌లో చోటు చేసుకున్న పరిణామాలు చాలా సంతోషం కలిగించాయని పేర్కొన్నారు.