న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అమరావతి రాజధానిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ సహా దాఖలైన మిగతా అన్ని పిటిషన్లపై విచారణ ఈ ఏడాది డిసెంబర్‌కు వాయిదా పడింది. అప్పట్లోగా నోటీసులు అందని ప్రతివాదులు ఇంకా ఎవరైనా ఉంటే వారికి నోటీసులు పంపించాల్సిందిగా ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది. బెంచ్ మారిన తర్వాత తొలిసారిగా సోమవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ఈ కేసు విచారణకు వచ్చింది. ఇది వరకు ఈ కేసును జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. అయితే ఆయన గత నెలలో పదవీ విరమణ చెందడంతో మరో ధర్మాసనానికి కేసును బదిలీ చేయడం అనివార్యం మారింది.
ఈ క్రమంలో సోమవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఎదుట జరిగిన విచారణలో అత్యవసరంగా కేసు విచారణ చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ధర్మాసనాన్ని కోరారు. అత్యవసర విచారణ సాధ్యం కాదని, ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు రాజ్యాంగ ధర్మాసనానికి సంబంధించిన కేసులున్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా తేల్చి చెప్పారు. మరోవైపు ప్రతివాదులుగా ఉన్న రైతుల్లో ఇద్దరు చనిపోయిన విషయాన్ని అమరావతి రైతుల తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వారిని ప్రతివాదుల జాబితా నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన మీదట జాబితా నుంచి తొలగించాల్సిందిగా ధర్మాసనం ఆదేశించింది. మొత్తం దాఖలైన పిటిషన్లలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను లీడ్ మ్యాటర్‌గా పరిగణిస్తూ తదుపరి విచారణ డిసెంబర్ నెలకు వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.