న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అగ్రనేతల నుంచి పిలుపు అందుకుని ఢిల్లీ చేరుకున్న అసంతృప్త నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదివారం కూడా ఢిల్లీలోనే ఉన్నారు. శనివారం రాత్రి పార్టీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాతో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో తాజా పరిస్థితులు, పరిణామాలను వివరించిన నేతలిద్దరూ ఆదివారం నాటి జేపీ నడ్డా తెలంగాణ పర్యటనకు హాజరుకాలేదు. తాము కేసీఆర్ కుటుంబ పాలన అంతం చేయడం కోసమే బీజేపీలో చేరామని, కానీ బీజేపీ – బీఆర్ఎస్ మధ్య లోపాయకారి ఒప్పందం కుదిరిందన్న ప్రచారం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ అంశంపై జాతీయ నాయకత్వం స్పష్టత ఇవ్వకపోతే ప్రజలు సైతం బీజేపీని తప్పుగా అర్థం చేసుకుంటారని చెప్పారు. మరోవైపు పార్టీలో తమకు సరైన ప్రాధాన్యత ఉండడం లేదని, అందరినీ కలుపుకోకుండా ముందుకెళ్తే గెలుపు కష్టమని కూడా చెప్పినట్టు తెలిసింది. మొత్తంగా నేతలిద్దరినీ అధిష్టానం పెద్దలు సముదాయించడంతో పాటు పార్టీ అంతర్గత అంశాల గురించి మీడియాలో లీకులు ఇవ్వడంపై మందలించినట్టు తెలిసింది. పార్టీలో అంతర్గత సమస్యలు ఏమున్నా సరే నేరుగా అధిష్టానం దృష్టికి తీసుకురావొచ్చని, అంతే తప్ప మీడియాకు లీకులివ్వడం మానుకోవాలని గట్టిగా చెప్పినట్టు సమాచారం.
ఈ పరిస్థితుల్లో ఆదివారం ఉదయం జేపీ నడ్డా తెలంగాణ, కేరళ రాష్ట్రాల పర్యటనకు ప్రత్యేక విమానంలో బయలుదేరగా.. ఆయనతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా బయల్దేరి వెళ్లారు. ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని శనివారం ఢిల్లీ వచ్చిన కిషన్ రెడ్డి అధిష్టానం పెద్దలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న విషయం తెలిసిందే. కిషన్ రెడ్డితో పాటు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తిరిగి వెళ్తారని భావించినప్పటికీ వారిద్దరూ మాత్రం ఢిల్లీలోనే ఉండిపోయారు.
మధ్యాహ్నం వరకు రాజగోపాల్ రెడ్డితో ఈటల మంతనాలు సాగించారు. ఆదివారం ఈ ఇద్దరు నేతలు తమ పార్టీ జాతీయాధ్యక్షుడి కార్యక్రమానికి కూడా హాజరుకాకుండా ఢిల్లీలోనే ఉండిపోవడంతో వివిధ రకాల ఊహాగానాలు చెలరేగాయి. నేతలిద్దరూ కాంగ్రెస్లో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారని, రాష్ట్రంలో ఆ పార్టీ గ్రాఫ్ పెరుగుతున్నందున అందులో చేరడమే ఉత్తమమని నేతలిద్దరూ భావిస్తున్నారని చర్చలు జరిగాయి.
అయితే రాజగోపాల్ రెడ్డి సన్నిహిత వర్గాలు మాత్రం ఆయన పార్టీ మారే అవకాశం లేదని చెప్పాయి. ఆ పార్టీలో రేవంత్ రెడ్డితో పొసగడం లేదనే బీజేపీలో చేరారని వారంటున్నారు. సమస్యలు ఏమున్నా అక్కడే తేల్చుకుంటారు తప్ప మళ్లీ కాంగ్రెస్కు తిరిగొచ్చే అవకాశం లేదని అంటున్నారు. మరోవైపు అమిత్ షాతో సమావేశమైనప్పటికీ ఈటల రాజేందర్ మాత్రం ఇంకా తన అసంతృప్తి వీడినట్టుగా కనిపించలేదు. ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి తన మనసులో ఉన్నది చెప్పాలని ఆయన భావిస్తున్నట్టు తెలిసింది. అందుకోసమే ఢిల్లీలో ఆగిపోయి ప్రధాని మోదీ సహా పార్టీలో మరికొందరు పెద్దలను కలిసే ప్రయత్నాల్లో ఉన్నారని తెలిసింది.