Sunday, November 10, 2024

జాతీయ రహదారి వెంట.. మళ్లీ వ్యర్థ రసాయనాల పారబోత

చౌటుప్పల్, (ప్రభ న్యూస్) : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని 65వ నెంబర్ జాతీయ రహదారిపై గత కొన్ని నెలలుగా ఆగిపోయిన వ్యర్థ రసాయనాల పారబోత వర్షాకాలం వర్షాలు పడుతుండడంతో మళ్లీ మొదలైంది. రసాయన పరిశ్రమలు విడుదల చేస్తున్న వ్యర్థ రసాయనాలను ట్యాంకర్ల ద్వారా రాత్రి సమయాలలో తరలించి జాతీయ రహదారి వెంట రోడ్డు పక్కన, వ్యవసాయ భూములలో యదేచ్ఛగా, విచ్చలవిడిగా పారబోస్తూ ప్రజల ఆరోగ్యాలను, పంటలను దెబ్బతీయడంతో పాటు భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నారు. రసాయన పరిశ్రమల యాజమాన్యాలు తమ పరిశ్రమల నుండి విడుదలైన రసాయన వ్యర్థాలను ట్యాంకర్ల ద్వారా తరలించి రోడ్లు వెంట, వ్యవసాయ భూములలో పారబోయడాన్ని నియంత్రించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం వల్ల రసాయన వ్యర్థాలను ఎక్కడబడితే అక్కడ విచ్చలవిడిగా పారబోస్తున్నారు.

- Advertisement -

ఉమ్మడి నల్లగొండ జిల్లా పిసిబి అధికారిగా సురేష్ బాబు బాధ్యతలు చేపట్టాక వ్యర్థ రసాయనాల పారబోత కొన్ని నెలలు ఆగిపోయింది. మళ్లీ ఏం జరిగిందో తెలియదు కానీ వ్యర్థ రసాయనాల పారబోత మళ్లీ మొదలైంది. చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్ పేట గ్రామం వద్ద కొత్తగూడెం బ్రిడ్జి సమీపంలో యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో జాతీయ రహదారి పక్కనే రాత్రి సమయంలో వ్యర్థ రసాయనాలను పారబోశారు. రసాయనాల ప్రభావంతో అక్కడ గడ్డి కాలిపోయి చెట్లు చనిపోయాయి. రసాయన వ్యర్థాలను పారబోసిన విషయాన్ని గుర్తించిన పోచంపల్లి మండలం లోని అంతమ్మగూడెం గ్రామానికి చెందిన రైతు గుమ్మి నరేందర్ రెడ్డి పిసిబి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

దీంతో స్పందించిన పిసిబి అధికారులు ఆదివారం జాతీయ రహదారి పక్కనే పారబోసిన వ్యర్థ రసాయనాల శాంపిల్స్ ను తీసుకున్నారు. తీసుకున్న శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించి వచ్చిన నివేదికల ఆధారంగా రసాయన వ్యర్ధాలను పారబోసిన పరిశ్రమను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకుంటామని పిసిబి అధికారులు తెలిపారు. కాగా రసాయన పరిశ్రమలు విడుదల చేసిన వ్యర్ధ రసాయనాల పారబోతను అడ్డుకునేందుకు పిసిబి అధికారులతో పాటు పోలీసులు కూడా అవసరమైన నిఘాను ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల రైతులు, ప్రజలు వేడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement