Thursday, November 21, 2024

తెలంగాణకు కేటాయించిన రోడ్లన్నీ దాదాపు మంజూరయ్యాయి.. రోడ్ల నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది : కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రానికి ‘ప్రధాన మంత్రి గ్రామీణ్ సడక్ యోజన’ (PMGSY)-3  కింద 2020-21 నుంచి ఇప్పటి వరకు 2,427.50 కి.మీ పొడవైన 356 రోడ్డు ప్రాజెక్టులకు కేటాయించినట్టు కేంద్రం తెలిపింది. బీఆర్ఎస్ ఎంపీలు జి. రంజిత్ రెడ్డి, మాలోత్ కవిత మంగళవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఈ ఏడాది డిసెంబర్ 14 నాటికి కేటాయించిన మొత్తం రోడ్లలో 2,395.84 కి.మీ రోడ్లు మంజూరయ్యాయని తెలిపారు.

ప్రధాన మంత్రి గ్రామీణ్ సడక్ యోజన మార్గదర్శకాల ప్రకారం టెండర్లు పిలవడం, పనులు పూర్తిచేయడం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతేనని మంత్రి వెల్లడించారు. అలాగే మంజూరు చేసిన 12 నెలల్లోగా రోడ్ ప్రాజెక్టులను పూర్తిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే భారీ వర్షాల కారణంగా కొన్ని రోడ్ ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం చోటుచేసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసిందని కేంద్ర మంత్రి సమాధానంలో పేర్కొన్నారు. మొత్తం మంజూరైన రోడ్లలో 1,066 కి.మీ పొడవైన 75 రోడ్ ప్రాజెక్టులు ఇప్పటి వరకు పూర్తయ్యాయని సాధ్వి నిరంజన్ జ్యోతి వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement