న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రేదశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో పొందుపర్చిన హామీలన్నీ దాదాపుగా అమలు చేశామని, మరికొన్ని హామీలు వివిధ దశల్లో అమలవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం తెలుగుదేశం ఎంపీ కే. రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ విషయం వెల్లడించారు. విభజన చట్టంలో పొందుపరిచిన మేజర్ పోర్టు ఏర్పాటు, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్‌పై కేంద్ర ప్రభుత్వం తన వైఖరి స్పష్టం మరోసారి స్పష్టం చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న వివాదాంశాలను పరస్పరం చర్చలు, పరస్పర అంగీకారం ద్వారా పరిష్కరించుకోవాలని కేంద్ర హోంశాఖ సూచించింది. చట్టంలో ఇచ్చిన హామీల్లో మౌలిక వసతుల ప్రాజెక్టులు, విద్యా సంస్థల ఏర్పాటు కోసం నిర్ణీత కాలపరిమితి ఉందని, ఆ మేరకు అవన్నీ పూర్తవుతున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ – సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ భవనాల నిర్మాణం కోసం 2022లో రూ. 106.89 కోట్లు మంజూరు చేయగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 10 కోట్లను విడుదల కూడా చేసినట్టు వెల్లడించారు.
దుగరాజపట్నంలో మేజర్ పోర్టు ఏర్పాటు సాధ్యం కాలేదని, సమీప ప్రాంతంలో ఉన్న పోర్టుల నుంచి గట్టి పోటీ ఉండడం వల్లనే సాధ్యపడలేదని కేంద్ర మంత్రి సమాధానంలో పేర్కొన్నారు. దుగ్గరాజుపట్నం బదులుగా రామాయపట్నం వద్ద మేజర్ పోర్టు అభివృద్ధి చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని, అయితే నాన్-మేజర్ పోర్టుగా నోటిఫై అయినందున డీ-నోటిఫై చేయాలంటూ సూచించామని చెప్పారు. లేదంటే మరో ప్రాంతాన్ని గుర్తించి సూచించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టు వెల్లడించారు. మరోవైపు కడపలో సమీకృత స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదని ‘స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా’ సమగ్ర అధ్యయనం అనంతరం స్పష్టం చేసిందని, అయినప్పటికీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం రోడ్ మ్యాప్ రూపకల్పన చేయాలంటూ కేంద్ర ఉక్కు శాఖ జాయింట్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిందని కేంద్ర మంత్రి సమాధానంలో పేర్కొన్నారు.
విభజన చట్టంలోని పొందుపరిచిన హామీల్లో ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ (ఐఐటి), గిరిజన విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) సహా అనేక విద్యాసంస్థలను ఇప్పటికే ఏర్పాటు చేసినట్టు కేంద్ర మంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం సహా ఇప్పటి వరకు రూ. 21,154.568 కోట్లు విడుదల చేసినట్టు వెల్లడించారు.
రెండు రాష్ట్రాల మధ్య విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు పరిష్కారం కోసం సమయానుకూలంగా కేంద్ర హో శాఖ సమీక్షిస్తోందని తెలిపారు. కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో ఇప్పటి వరకు 31 సమావేశాలు, సమీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. పెండింగ్ అంశాలను రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతోనే ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోందని తెలిపారు. వివాదాలున్న సమస్యలకు ఆమోదయోగ పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం కేవలం మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరిస్తుందని వెల్లడించారు.మరోవైపు రాజ్యసభలో తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకచ్ చౌదరి సమాధానమిస్తూ.. రాష్ట్రాలకు ప్రత్యేక రుణం అందించే క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయం అందుతోందని వెల్లడించారు.