హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని చిక్కడపల్లి పోలీసులను కోర్టు ఆదేశించింది.
ఇది ఇలా ఉంటే ఈ నెల 4వ తేదీన పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ ను ఏ11 ముద్దాయిగా చేర్చారు చిక్కడపల్లి పోలీసులు. ఈ కేసులో డిసెంబర్ 13న హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా . బన్నీకి నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసును సవాల్ చేస్తూ అల్లు అర్జున్ హై కోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు అల్లు అర్జున్‌కు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో బన్నీ జైలు నుండి విడుదల అయ్యాడు. ఈ కేసులో రెగ్యులర్ నాంపల్లి కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని బన్నీకి హై కోర్టు సూచించింది.
ఈ మేరకు అల్లు అర్జున్ నేడు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరగగా.. కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసుల తరుఫు పీపీ సమయం కోరారు. దీంతో బన్నీ బెయిల్ పిటిషన్‌పై కోర్టు సోమవారానికి విచారణ వాయిదా వేసింది. మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఇవాళ్టితో ముగియడంతో బన్నీ వర్చువల్ గా నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఇక తొక్కిసలాట కేసు విచారణను జనవరి 10 వ తేదికి వాయిదా వేసింది.