Tuesday, November 26, 2024

పోలవరం సందర్శనకు అనుమతివ్వండి.. సీఎం జగన్‌కు ఏపీసీసీ చీప్ గిడుగు లేఖ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: జనవరి మొదటివారంలో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు అనుమతినివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి రాసిన 2 పేజీల లేఖను ఆదివారం ఢిల్లీలో మీడియాకు విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, నిపుణుల బృందం జనవరి మొదటివారంలో పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జీవధారగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న అనుచిత జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని గిడుగు డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ అనుకూలంగా ఉందని, రాష్ట్ర విభజన సందర్భంగా పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన ఘనత కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానిదేనని ఆయన వ్యాఖ్యానించారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం దివంగత నేత డా. వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి కల అని, ఆయన వారసుడైన ముఖ్యమంత్రి జగన్ తండ్రి కలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని గిడుగు రుద్రరాజు వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు 2004-2014 మధ్యకాలంలో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే మంజూరయ్యాయని గుర్తుచేశారు. జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణాన్ని రాష్ట్రప్రభుత్వం చేపట్టడాన్ని ప్రతిపక్ష నేతగా తప్పుపట్టిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వమే ఈ నిర్మాణాన్ని ఎందుకు కొనసాగిస్తుందో రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు కాంగ్రెస్‌పార్టీ ప్రతినిధి బృందం సందర్శనలో ఎటువంటి రాజకీయం లేదని, అనుమతులు మంజూరు చేసి రాష్ట్రప్రభుత్వం తన పారదర్శకత పరిపాలనను నిరూపించుకోవాలని సూచించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement