Tuesday, November 26, 2024

ఇంజనీరింగ్‌లో తుదివిడత సీట్ల కేటాయింపు పూర్తి.. ఇంకా, 13వేల ఖాళీ సీట్లు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ తుది విడత సీట్లు కేటాయింపు పూర్తయింది. కన్వీనర్‌ కోటాలో మూడు విడతల్లో కలిపి ఇప్పటి వరకు మొత్తం 70,627 సీట్లను భర్తీ చేశారు. తుది విడత కౌన్సెలింగ్‌ పూర్తయ్యాక కన్వీనర్‌ కోటాలో ఇంకా 13,139 సీట్లు మిగిలాయి. కన్వీనర్‌ కోటాలో రాష్ట్రంలో 83,766 ఇంజనీరింగ్‌ సీట్లు ఉండగా, వాటిలో సెకండ్‌ ఫేజ్‌ వరకూ 62,738 మంది విద్యార్థులు ఆయా కళాశాలల్లో జాయిన్‌ అయ్యారు.

అయితే తుది విడతలో 21,028 సీట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించగా అందులో 7889 సీట్లు భర్తీకాగా ఇంకా 13,139 సీట్లు మిగిలాయి. మొత్తంగా 174 ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 83,766 సీట్లలో 70,627 (84.31శాతం) సీట్లు కేటాయించగా ఇంకా 13,139 సీట్లు మిగిలాయి. ఈ మిగిలిన సీట్లను ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ నిర్వహించి విద్యార్థులకు కేటాయిస్తారు.

- Advertisement -

గతేడాది కంటే ఈసారి భర్తీ అయిన సీట్ల సంఖ్య కాస్త పెరిగింది. 3 యూనివర్సిటీలు, 27 ప్రైవేట్‌ కాలేజీల్లో వందకు వంద శాతం సీట్లు నిండాయి. ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద ఇప్పటి వరకు 5480 మందికి సీట్లు కేటాయించారు. కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ సంబంధిత ఇంజనీరింగ్‌ కోర్సుల్లో అత్యధికంగా 93.35 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. సీటు పొందిన విద్యార్థులు ఈనెల 9 నుంచి 11వ తేదీలోపు ఆయా కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది.

కన్వీనర్‌ కోటాలో మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల 17 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా మరో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనెల 17న స్లాట్‌ బుకింగ్‌, 18న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈనెల 17 నుంచి 19 వరకు వెబ్‌ ఆప్షన్లు స్వీకరించి 23న సీట్లు కేటాయిస్తారు. స్పాట్‌ ప్రవేశాల కోసం అదే రోజున మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement