Sunday, September 8, 2024

Delhi | పోర్ట్ స్థలం కేటాయించండి.. కేంద్ర మంత్రికి ఎంపీ జీవీఎల్ లేఖ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఆధీనంలో ఉన్న స్థలం నుంచి కొంత భాగాన్ని ప్రయాణికులు, సైనికుల కోసం కేటాయించాలని కోరుతూ కేంద్ర నౌకాయానం, ఓడరేవుల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్‌కు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు లేఖ విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు అవసరమైన ‘బల్బ్ లైన్’ నిర్మాణం కోసం అలాగే మాజీ సైనికుల కోసం నిర్మించతలపెట్టిన ‘సైనిక్ భవన్’ కోసం పోర్టు స్థలాన్ని కేటాయించాలని కోరుతూ రాసిన లేఖను ఆయనకు అందజేశారు.

అనంతరం కేంద్ర మంత్రితో ఈ రెండు నిర్మాణాల ఆవశ్యకత గురించి వివరించారు. జీవీఎల్ ప్రతిపాదనపై స్థల కేటాయింపుకు ఉన్న అవకాశాలను తక్షణమే పరిశీలించాలని కేంద్ర మంత్రి అధికారులను ఆదేశించారు. రూ.85.28 కోట్ల వ్యయంతో క్విక్ ప్లాట్ ఫాం క్లియరెన్స్, లోకో రివర్సల్, షంటింగ్ వంటి చర్యలను నివారించడం ద్వారా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ 2016లోనే విశాఖ రైల్వేస్టేషన్ లో ‘బల్బ్ లైన్’ నిర్మించాలని నిర్ణయించగా, ఇందుకు అవసరమైన భూమిని ఇవ్వడానికి విశాఖ పోర్టు ట్రస్ట్ గతంలో నిరాకరించిందని, ప్రజాహితం కోసం ప్రభుత్వ శాఖలు పరస్పర సహకారంతో, చిత్తశుద్ధితో పనిచేయాలన్నదే ప్రధాని మోదీ నినాదమని ఈ సందర్భంగా జీవీఎల్ గుర్తుచేశారు.

- Advertisement -

విశాఖ రైల్వేస్టేషన్ లో ‘బల్బ్ లైన్’ నిర్మాణానికి వాల్తేరు రైల్వే డివిజన్‌కు తగినంత స్థలాన్ని అందజేస్తే తద్వారా రైళ్ల ట్రాఫిక్‌ను తగ్గించి, ఎక్కువ రైళ్ల రాకపోకలకు వీలు కల్గుతుందని అన్నారు. ‘బల్బ్ లైన్’ నిర్మాణానికి ఇచ్చిన భూమికి బదులుగా విశాఖ పోర్టు అథారిటీ పరిహారం లేదా ప్రత్యామ్నాయ భూమిని కోరవచ్చని ఎంపీ జీవీఎల్ తన లేఖలో ప్రతిపాదించారు.

మరోవైపు విశాఖలో సైనిక్ భవన్, సైనిక్ రెస్ట్ హౌస్ నిర్మాణానికి  కూడా విశాఖ పోర్టు భూమిని అందచేయాలని ఎంపీ జీవీఎల్ కేంద్ర మంత్రిని కోరారు. ఇది ఎంతో ఉదాత్తమైన కార్యక్రమమని, ఈరకంగా దేశానికి విశిష్ట సేవలందించిన మాజీ సైనికుల అవసరాలను తీర్చవచ్చని అన్నారు. ఈ విషయంలో తాను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కూడా కలిసి మాట్లాడినట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనపై కూడా సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి జీవీఎల్ చేసిన రెండు ప్రతిపాదనలను వెంటనే పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement