న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌లో కేంద్ర సాంస్కృతిక ఏర్పాటు చేయదలచిన సైన్స్ సిటీకి అవసరమైన పాతిక ఎకరాల భూమితో పాటు, డీపీఆర్, మార్గదర్శకాలను వెంటనే తయారు చేయించి పంపవలసినదిగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖా మంత్రి కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన శుక్రవారం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. సైన్స్ సిటీకి అవసరమైన ప్రతిపాదనను పంపించమని కోరుతూ 15 డిసెంబర్, 2021లో తాను మొదటి లేఖ రాసిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఆ తర్వాత 22 ఫిబ్రవరి, 2022న కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇదే విషయంపై లేఖ రాశారన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో సైన్స్ సిటీ ఏర్పాటుకు డీపీఆర్ తయారీకి అవసరమైతే సాంకేతిక సహాయాన్నీ అందించడానికి సిద్ధంగా ఉన్నామని తాను మే నెలలో రాసిన లేఖలో స్పష్టం చేశానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలోని విద్యార్థులు, యువతలో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించే ఈ సైన్స్ సిటీని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసినట్లయితే పర్యాటకంగా కూడా నగరానికి మంచి గుర్తింపు వస్తుందని ఆయన లేఖలో అభిప్రాయపడ్డారు. సీసీఎంబీ, ఐఐసీటీ, సీఎఫ్‌ఎస్‌ఎల్, సీడీఎఫ్‌డీ, ఎన్జీఆర్‌ఐ, ఎన్‌ఐఎన్,ట్రిపుల్ ఐటీ వంటి జాతీయ ప్రాముఖ్యత కలిగిన అనేక పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు, శాస్త్రీయ సంస్థలు, ఐటీకి సంబంధించిన అనేక అంతర్జాతీయ సంస్థల పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఉన్న హైదరాబాద్ నగరం సైన్స్ సిటీని ఏర్పాటుకు కావలసిన అన్ని రకాల అర్హతలను కలిగి ఉందని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కోలకత్తా, బెంగళూరు, ముంబై, కురుక్షేత్ర సైన్స్ సిటీలను ప్రతి రోజూ వేలాది మంది విద్యార్థులు, పర్యాటకులు సందర్శించి సైన్స్ పట్ల ఎంతో ప్రేరణను పొందుతున్నారని ఆయన వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.