Friday, November 22, 2024

National | కాంగ్రెస్‌-ఆప్‌ మధ్య 5 రాష్ట్రాల్లో కుదిరిన పొత్తు..

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మార్చి రెండో వారంలో ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఏప్రిల్‌ నెలలో ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో పార్టీలన్నీ యాక్టివ్‌గా మారాయి. పొత్తుల వ్యవహారాలతోపాటు సీట్ల సర్దుబాటుపై కసరత్తు ముమ్మరం చేస్తున్నాయి. ఈ ఎన్నికలను కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇండియా కూటమిని ఏర్పాటు చేసి.. అన్ని పార్టీలను ఒక గొడుగు కిందకు చేర్చి.. బీజేపీని ఓడించాలని ప్లాన్‌ చేస్తోంది.

ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీ, ఆమ్‌ ఆద్మీతో పొత్తులపై ప్రకటన విడుదల చేసింది. అయిదు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీల మధ్య సీట్ల పంపకాలన ప్రక్రియ పూర్తయింది. తొలిదశలో చండీగఢ్‌ కేంద్ర పాలిత ప్రాంతంతోపాటు అయిదు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌, ఆప్‌ పార్టీలు సీట్లను పంచుకున్నాయి. ఢిల్లి, గుజరాత్‌, హర్యానా, చండీగఢ్‌, గోవా రాష్ట్రాల్లో ఉన్న అన్ని లోక్‌సభ స్థానాల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఢిల్లి పరిధిలోని మొత్తం 7 లోక్‌సభ స్థానాల్లో మూడు చోట్ల కాంగ్రెస్‌, మిగిలిని నాలుగు చోట్ల ఆప్‌ అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు.

ఇందులో న్యూఢిల్లి, వెస్ట్‌ డీల్లి, సౌత్‌ ఢిల్లి, ఈస్ట్‌ ఢిల్లి నుంచి ఆప్‌ అభ్యర్థులు పోటీ చేస్తారని.. చాందినిచౌక్‌ , నార్త్‌ ఈస్ట్‌ ఢిల్లి, నార్త్‌ వెస్ట్‌ ఢిల్లి నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పోటీ చేయనుంది. ఈ మేరకు కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరి ముకుల్‌ వాస్నిక్‌ మీడియాకు వివరించారు. ఇక బీజేపీ పటిష్టంగా ఉన్న గుజరాత్‌ రాష్ట్రంలో మొత్తం 26 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో 24 చోట్ల కాంగ్రెస్‌ పోటీ చేస్తుండగా.. కేవలం 2 చోట్ల మాత్రమే ఆప్‌ అభ్యర్థులు పోటీ చేయనున్నారు.

అవి కూడా భరూచ్‌, భావ్‌నగర్‌లో మాత్రమే ఆప్‌ తన అభ్యర్థులను నిలబెట్టనుంది. ఇటు హర్యానాలో మొత్తం 10 సీట్లలో తొమ్మిదిచోట్ల కాంగ్రెస్‌ పోటీ చేస్తుండగా, ఒక్క స్థానంలో అది కూడా కురుక్షేత్రలో ఆమ్‌ ఆద్మీ పార్టీ పోటీ చేయనుంది. ఇక చండీగఢ్‌ను కాంగ్రెస్‌ తీసుకుంది. ఇక్కడ ఆమ్‌ ఆద్మీ పార్టీ హస్తానికి మద్దతు ఇవ్వాల్సి ఉంది. గోవాలో ఉన్న రెండు లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులే పోటీ చేయనున్నారు. మరోవైపు పంజాబ్‌లో మాత్రం కాంగ్రెస్‌తో ఆమ్‌ ఆద్మీ పొత్తు పెెట్టుకోలేదు. ఇక్కడ ఉన్న మొత్తం 13 సీీట్లలో కూడా ఆమ్‌ ఆద్మీ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగనుంది.

అయితే.. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ ఎలా పోటీ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు రాజ్యమేలుతున్నాయని.. తమ కూటమికి దేశ ప్రయోజనాలే ముఖ్యమని.. పార్టీల ప్రయోజనాలు కాదని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ముకుల్‌ వాస్నిక్‌ చెప్పుకొచ్చారు. దేశంలో ప్రతిపక్ష నేతల అరెస్ట్‌లు, రైతులపై జరుగుతున్న దౌర్జ న్యాల్ని ప్రశ్నించడానికి ప్రతిపక్ష పార్టీలన్ని ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇండియా కూటమితో బీజేపీకి వ్యతిరేకంగా బలమైన ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేస్తామని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత సందీప్‌ పాథక్‌ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement