Friday, November 22, 2024

Delhi: జనసేనతోనే పొత్తు, ప్రయాణం.. టీడీపీ, వైఎస్సార్సీపీకి దూరం దూరంగా బీజేపీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న అనూహ్య మార్పులను భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం నిశితంగా గమనిస్తోంది. ఓవైపు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నికలతో తలమునకలై ఉన్న అధినేతలు, ఆంధ్రప్రదేశ్‌లో తమ మిత్రపక్షం అధినేత పవన్ కళ్యాణ్‌ కదలికలపై కన్నేసింది. బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై పవన్ చేసిన ఆరోపణలు ఓవైపు, ఆయన్ను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చి కలవడం మరోవైపు.. అధిష్టానం దృష్టిని ఏపీ రాజకీయాలపై మరల్చేలా చేశాయి. వీటిలో పవన్-బాబు కలయికకు అంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని రాష్ట్ర నాయకత్వానికి సూచించినట్టు తెలిసింది.

ఒక రాజకీయ పార్టీ అధినేతను ఇతర పార్టీల అధినేతలు వచ్చి కలవడాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదని, ఎన్నికల సమయం కానప్పుడు ఈ భేటీని పొత్తులతో ముడిపెట్టాల్సిన అవసరం లేదని చెప్పినట్టు సమాచారం. పవన్-బాబు భేటీ అనంతరం బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును ఢిల్లీకి పిలిపించారని తొలుత వార్తలొచ్చాయి. అయితే ఆయన బెంగళూరులో ఉన్నట్టు తెలిపారు. కానీ జాతీయ నాయకత్వంతో ఈ అంశంపై చర్చ జరిగిందని చెప్పారు. తెలుగుదేశం, వైఎస్సార్సీపీలకు సమదూరం పాటిస్తూ వస్తున్న ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి నిర్దేశించినట్టు తెలిసింది.

జాతీయస్థాయిలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలను అటు వైఎస్సార్సీపీ, ఇటు తెలుగుదేశం పార్టీలు సమర్థిస్తున్నాయి. ఈ దశలో తెలుగుదేశం పార్టీని దగ్గరకు తీసుకుంటే, వైఎస్సార్సీపీని దూరం చేసుకోవాల్సి వస్తుంది. లోక్‌సభలో కాంగ్రెస్, టీఎంసీ తర్వాత 3వ అతిపెద్ద పార్టీగా ఉన్న వైఎస్సార్సీపీని దూరం చేసుకోవడం సరికాదన్న అభిప్రాయంలో అధినేతలున్నట్టు తెలిసింది. పైగా రానున్న శీతాకాల సమావేశాలు, ఆ తర్వాత జరిగే బడ్జెట్ సమావేశాల్లో దేశంలో ప్రకంపనాలు సృష్టించే బిల్లులను తీసుకొచ్చేందుకు కమలనాథులు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఉభయసభల్లో తెలుగుదేశంతో పోల్చితే అనేక రెట్లు సంఖ్యాబలం ఉన్న వైఎస్సార్సీపీని దూరం చేసుకోవడం మూర్ఖత్వమే అవుతుందని ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు చూసే బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అందుకే రెండు పార్టీల్లో ఏ ఒక్క పార్టీని దగ్గర చేసుకోవద్దని, అలాగే దూరమూ చేసుకోవద్దని కమలనాథులు భావిస్తున్నట్టు తెలిసింది.

- Advertisement -

ఢిల్లీకి పవన్ కళ్యాణ్?
బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరుపై అసంతృప్తి, అసహనాన్ని బహిరంగంగానే వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్‌ను బీజేపీ పెద్దలు ఢిల్లీకి పిలిపించినట్టు కథనాలు వచ్చాయి. చంద్రబాబు నాయుడుతో జరిగిన భేటీతో పాటు ఆయన లేవనెత్తిన అభ్యంతరాలపై చర్చించేందుకు పిలిపించారని ప్రచారం జరిగింది. అయితే పవన్ ఢిల్లీకి రావడం లేదని ఆయన క్యాంప్ స్పష్టం చేసింది. దీపావళి తర్వాత ఢిల్లీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

పవన్ కళ్యాణ్ గత కొద్ది కాలంగా తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణించాలన్న అభిప్రాయాన్ని పరోక్షంగా వెలిబుచ్చుతున్నారని బీజేపీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు. వైఎస్సార్సీపీని ఓడించాలని ప్రతిపక్షాలన్నీ కలసికట్టుగా పోరాడాలని, తన ముందున్న లక్ష్యం వైఎస్సార్సీపీని గద్దె దించడమేనని పలుమార్లు పవన్ వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీని ఓడించేందుకు 2014 తరహాలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీచేయాలన్న అభిప్రాయాన్ని పరోక్షంగా చెబుతున్నారని బీజేపీ వర్గాలు సూత్రీకరించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌ను చేజారకుండా కాపాడుకోవాలని బీజేపీ జాతీయ నాయకత్వం చూస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement