మహారాష్ట్ర రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే అవినీతి ఆరోపణల కారణంగా మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా కూడా చేశారు. ఇప్పుడు మరో మంత్రిపైనా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ముకేష్ అంబానీ ఇంటి వద్ద బాంబు బెదిరింపుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కస్టడీలో ఉన్న పోలీసు అధికారి సచిన్ వాజే సంచలన విషయాలు వెల్లడించారు. బార్లు, పబ్బుల నుంచి రూ.100 కోట్లు వసూలు చేసి ఇవ్వాలని తనకు అనిల్ దేశ్‌ముఖ్ నిర్దేశించారని అంగీకరించారు. అంతేకాదు ఓ సంస్థ నుంచి రూ.50 కోట్లు వసూలు చేసి పెట్టాలని రవాణా శాఖ మంత్రి శివసేన నేత అనిల్ పరబ్ తనకు పురమాయించారని వాజే పేర్కొన్నారు.
అయితే ఓ సంస్థ నుంచి రూ.50 కోట్లు వసూలు చేసి పెట్టాలని వాజే తనపై చేసిన ఆరోపణలను రవాణా శాఖ మంత్రి పరబ్ ఖండించారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణల కేసులో సచిన్ వాజేను విచారించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు సీబీఐకి అనుమతి మంజూరు చేసింది. అలాగే, వాజే కస్టడీని ఈ నెల 9వ తేదీ వరకు పొడిగించింది.