మార్కిజం దాని ఉన్నత రూపమని చెబుతున్న మావోయిజం పిడివాదం కాదు, అది పూర్తిగా శాస్త్రీయ సిద్ధాంతమని వామపక్షీయులు, వామపక్ష తీవ్రవాదులు దశాబ్దాలుగా చెబుతున్నారు. గాలిలోకి బంతి విసిరితే గురుత్వాకర్షణ శక్తి కారణంగా భూమికి ఎలా తిరిగి వస్తుందో అంతటి నికార్సయిన శాస్త్రీయ సిద్ధాంతం మార్కిజమని, గొంగళి పురుగు వివిధ దశలు దాటి అందమైన సీతాకోక చిలుకగా ఎలా రూపాంతరం చెందుతుందో అలాగే పెట్టుబడిదారి వ్యవస్థ రూపాంతరంచెంది సోషలిస్టు వ్యవస్థ ఏర్పడటం అంతే సహజమని, చారిత్రక పరిణామాలు ఇందుకు ప్రమాణాలుగా నిలుస్తాయని వారు పదే పదే అదే పల్లవిని వినిపించారు. ఈ ప్రపంచానికి, దేశానికి కమ్యూనిజం తప్ప మరో మార్గం లేదని, అది అనివార్యమని, చారిత్రక భౌతిక వాదం ఆ విషయాన్ని చాటి చెబుతోందని చాటింపు వేసి మరీ ప్రకటించారు. తాజాగా మావోయిస్టులు ఓ అడుగు ముందుకేసి, తుపాకులు పేల్చి మరీ దిక్కులు ప్రతిధ్వనించేలా గర్జిస్తున్నారు. సమాజంలో సాంఘిక, ఆర్థిక పరిస్థితుల ఘర్షణ కారణంగానే వర్గాలు ఏర్పడ్డాయని ఆ వర్గ సంఘర్షణ నిరంతరం కొనసాగుతూ చివరికి శ్రమ జీవులు దోపిడీ రహిత కమ్యూనిస్టు వ్యవస్థ ఏర్పరచుకుని ఎలాంటి సంకెళ్ళులేని సుఖవంతమైన, సంతోషకర జీవితం గడుపుతార ని ఆ సిద్ధాంత అభిమానులు పున:పున: ప్రకటిస్తూ ప్రజల్ని ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం పోరాడితే పోయేదేమి లేదు… బానిస సంకెళ్ళు తప్ప అని ప్రజల్ని ప్రేరేపి స్తున్నారు. ప్రోత్సహిస్తున్నారు. అలాగే పనిలో పనిగా ప్రపంచ కార్మికులందరూ ఏకం కావాలని పిలుపునిస్తున్నారు.
దేశంలో గత వందేళ్లుగా దీన్నే కలవరిస్తున్నా, పలవరిస్తున్నా ఆ కమ్యూనిజం – సోషలిజం జాడ అంజనమేసి చూసినా ఎక్కడా కనిపించడం లేదు. పైగా పెట్టుబడిదారి విధానం మరింత చిక్కబడుతోంది. మెరుగవుతోంది, విస్తరిస్తోంది. ఒకప్పటి కమ్యూనిస్టు సమాజాలు పెట్టుబడి దారి సమాజాలవుతు న్నాయి. మరిన్ని మానవీయ కోణాలను, కార్మిక సంక్షేమ అంశాలను విలీనం చేసుకుని సమకాలీన పద్ధతులను అందిపుచ్చుకుని ఉత్పత్తి పెరిగే ప్రక్రియకు ఆ విధానం దోహద పడుతోంది. నూతన ఆవిష్కరణలతో ఆగామి తరాలకు కొత్త దారులు వేస్తోంది. ఇదంతా బహిరంగంగా జరుగుతోంది. రహస్యం ఏమీ లేదు. ఈ నేపథ్యంలో మరి వామపక్షాలు దశాబ్దాలుగా చెబుతున్న (ఊహా గాన) కమ్యూనిజం – సోషలిజం మాటేమైంది? అన్న ప్రశ్న తప్పక ఉదయిస్తుంది కదా? వారి చారిత్రక భౌతికవాదం, కార్యాకారణ సంబంధం, గతితర్కం ఎక్కడ దాక్కుంది? ఏమైంది? అన్న ప్రశ్నల కొడవళ్లు పుట్టుకొస్తాయి కదా? గత నాలుగు దశాబ్దాలుగా, నాల్గవ పారిశ్రామిక విప్లవం వెయ్యి రేకలుగా విరబూసిన అనంతరం ప్రపంచం పూర్తిగా రూపాంతరం చెందుతోంది. అయితే వామపక్షాలు చెప్పిన క్రమాను గత గతితర్కం, చారిత్రక భౌతిక వాదం పద్ధతిలో సోషలిజం – కమ్యూనిజం దిశగా రూపాంతరం చెందడం లేదు. దాంతో ఇంతకాలం వారు పలికిన పలుకులన్నీ డొల్ల అని తేలింది కదా? దాంతో శాస్త్రీయ సిద్ధాంతమన్నది కాస్త ఆశాస్త్రీయమని తేటతెల్లమైంది కదా? ఇంతకాలం తామొక స్వాప్నిక లోకంలో విహరిస్తూ చేసిన ప్రేలాపనలవని తేలిపోయింది కదా? ఈ వాస్తవికతను తెలుసుకోవడానికి ఎవరైనా సిద్ధాంత అధ్యయనం, తులనా త్మక పరిశీలన, లోతైన పరిశోధ న చేయనవసరం లేదు.
అదిగో కార్మికలోకం వచ్చేస్తోంది, దున్నేవాడికే భూమి లభించనున్న ది, పెత్తందార్ల దౌర్జన్యం ఇంకానా ఇకపై సాగదు అని అరచేతిలో స్వర్గం చూపిస్తే ఆ స్వర్గం ఇప్పుడు ఎక్కడా కనిపించకపోతే, చివరికి అలా చెప్పిన కామ్రేడ్స్ సైతం కనిపించకుండా పోతే ఆ సిద్ధాంతాలకు, ఆ పలుకులకు విలువెక్కడ ఉంటుంది? గౌరవం ఎలా దక్కుతుంది? విశ్వాసం ఎలా కుదురుతుంది? ఆ మాటల్లో డొల్లతనమే దర్శనమవుతోంది. రంగు వెలిసిన వైనమే కనిపిస్తోంది. అయినా భారత మావోయిస్టులు దీన్ని సుతరాము అంగీకరించడానికి సిద్ధంగా లేరు. మొండిగా, మూర్ఖంగా కాలమాన పరిస్థితులకు పూర్తి భిన్నంగా మార్క్సిజం – మావోయిజం అజరామరం అంటూ దండకారణ్యంలో అక్షరాలు రాని ఆదివాసీల జీవితాలతో సరికొత్త ప్రయోగం చేయపూనుకోవడం చదివస్తే ఉన్న మతి పోయిన చందంగా ఉంది తప్ప మరోలా కనిపించడం లేదు. రోజురోజుకు మనిషి ఆలోచన మెరుగుపడాలి. విశాల మవ్వాలి. విద్వత్ భరితం కావాలి. వెలుగు పుంజం అవ్వాలి. కాని మావోల మాటలు తద్భిన్నంగా ప్రతిధ్వనిస్తున్నాయి. డొల్లతనమే కనిపిస్తోంది. అలాంటప్పుడు ఎవరైనా వాటినెల ఆహ్వానిస్తారు? మార్క్స్ జీవించి ఉండగానే ‘తాను మార్క్సిస్టును కాను’ అని ప్రకటించారు.
ఈ విషయం లోకమంతటికీ తెలుసు. మార్క్స్ స్వయంగా ఆ మాటలు చెప్పాక మావోలు చెబుతున్న మార్క్సిజం ఎక్కడి నుంచి వచ్చింది. ఈ కీలక ప్రశ్నకు సమా ధానాన్ని చాలా కాలంగా దాటేస్తూ ఉన్నారు. తప్పుడు భావాల్ని ప్రచారం చేస్తున్నారు. తమది శాస్త్రీయ సిద్ధాంతమని అబద్ధా లు, డొల్ల మాటలతో అదే పనిగా గోబెల్ ప్రచారం చేస్తున్నారు. ‘వాస్తవ జీవన ఆవిర్భావం, పునరావిర్భావం మాత్రమే చరిత్ర ను నిర్ణయించే విషయం… ఇంతకు మించి నేను (ఏంగిల్స్) గాని, మార్క్స్ గాని ఏనాడు చెప్పలేదు’ అని 1890 ఆగస్టు 5న తన మిత్రుడి కి రాసిన లేఖలో ఏంగిల్స్ స్పష్టంగా పేర్కొన్నా రు. అంతేగాక ‘ఆర్థికాం శమే నిర్ణయాత్మకమైన దని ఎవరు చెప్పినా వారు తమ (మార్క్స్- ఏంగిల్స్) భావాలను, ఆలోచన లను మంటగలిపినట్టే..’ అని కూడా ఆయన ఘాటుగా అన్నారు. మరి మావోయిస్టులు ఇంతకాలం నుడువుతున్న దంతా ఆర్థికాంశమే నిర్ణయాత్మకమని కదా..?
మార్క్స్, ఏంగిల్స్ మరణానంతరం ఆయా దేశాల్లోని అభిమానులు వారి రచనలకు తమదైన రీతిలో భాష్యం చెప్పు కుని, ఆ ‘ఎంగిలి’ మాటల్ని వారికి అంటగట్టి తమ రాజ్యాధికార దాహం తీర్చుకునే ప్రయత్నం చేశారు. చేస్తున్నారు. భారత మావోయిస్టులు ఆ కోవకు చెందిన వారే కావడం విషాదం. కారల్ మార్క్స్ మూలభావనకు విరుద్ధంగా మావోయిస్టులు తుపాకులు, మందుపాతరలు పేల్చి మరీ చెబితే అదెలా నిజాయితీ అనిపించుకుంటుంది? సత్యాన్ని ఎలా బహిర్గతం చేసినట్లవుతుంది? ఇదే మార్క్సిజాన్ని విశ్వసించే సీపీఐ, సీపీఎం పార్టీల గళానికి మావోయిస్టుల మాటలకు ఎంతో తేడా కనిపిస్తోంది. అంతెందుకు మావోయిజాన్ని నమ్ముతూ నక్సలై ట్లుగా చెప్పుకుంటున్న అనేక గ్రూపుల అభిప్రాయాలకు, ఆలోచనలకు మావోల ఆచరణకు హస్తిమశకాంతరముంది. ఒకే సిద్ధాంతం, ఒకే భావజాలం, అందరికీ ఒకేలా కనిపించాలి కదా? కానీ అన్వయం పేర పూర్తిగా భ్రష్టుపట్టిస్తూ పరస్పర విరుద్ధంగా పెడధోరణులు అవలంభిస్తే అదెలా సబబు., న్యాయసమ్మత మవుతుంది. వారంతా రివిజనిస్టులు, మేం బోల్షివిక్కులం అని సమర్థించుకుంటే హేతుబద్ధత సంతరించు కున్నట్టవుతుందా? పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా రాజ్యాధికారమని కొన్ని నక్సల్స్ పార్టీలు పనిచేస్తుంటే, మావో యిస్టులు మాత్రం తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమని సామాన్య ప్రజల్ని, ఆదివాసీలను పొట్టన పెట్టుకుం టుంటే అదెలా పేద ప్రజల పక్షపాత రాజకీయ పార్టీ అనిపించు కుంటుంది? సమకాలీన సమాజాన్ని సరైన రీతిలో విశ్లేషించ కుండా, అందులోని డైనమిక్స్ అవగాహన చేసుకోకుండానే వంద సంవత్సరాల క్రితపు అవగాహనతో ఆయుధాలు పడితే పేద ప్రజలకు ఒరిగేదేమిటి? అన్న ప్రాథమిక ప్రశ్నకు సమా ధానాన్ని మావోయిస్టులు ఇంకెం త కాలం దాటేస్తారు? మిత్రమా! మీ విశ్లేషణ లోపభూయిష్టం. దానికి కాలం చెల్లింది. దాన్ని సరిదిద్దుకోవలసిన సమయం ఆసన్నమైందని ఇంకెప్పుడు గ్రహిస్తారు? గుర్తిస్తారు?
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..