Friday, November 22, 2024

రాష్ట్రంలో జల కళ.. ప్రాజెక్టులన్నీ ఫుల్​ ట్యాంక్​ లెవల్​, యాసంగికి ఢోకా లేదు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో జలదృశ్యం కన్నుల విందు చేస్తున్నాయి. బిర బిర కృష్ణ మ్మ, పరుగులు పెడుతుంటే గలగల గోదారి పరవళ్లతో రిజర్వాయర్లు పరవశించి పోతున్నాయి. అక్టోబర్‌ మాసం ముగింపు కు వస్తున్నప్పటికీ ఇంకా ప్రాజెక్టుల్లో ఇన్‌ ఫ్లో, ఔట్‌ ఫ్లోలు కొనసాగుతున్నాయి. గత కొద్ది సంవత్సరాల ముందుకు వెళ్లితే అక్టోబర్‌ మాసంలో ఇన్‌, ఔట్‌ ఫ్లోలు తగ్గిపోయాయి. ప్రాజెక్టుల గేట్లు మూతలు పడేవి. అయితే ప్రస్తుతం అందుకు భిన్నంగా జలదృశ్యం ఆవిష్కరిస్తోంది. ప్రాజెక్టుల్లో సంవృద్ధిగా నీరు చేరడంతో యాసంగి పంట విస్తీర్ణం పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. యాసంగిలో 68.16లక్షల ఎకరాలకు సాగునీరు సంవృద్ధిగా అందించే అవకాశాలున్నాయని నీటిపారుదల శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో యాసంగికి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తుంది.

సుమారు 52.80 లక్షల ఎకరాల వరికి సునాయసంగా సాగునీరు అందింంచే అవకాశాలున్నాయని ఇరిగేషన్‌ శాఖ స్పష్టం చేసింది. అలాగే వరితో పాటుగా ఇతర పంటలకు కూడా సంవృద్ధిగా నీరు అందించేందుకు ఇరిగేషన్‌ శాఖ ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్టస్థాయిలో ఉండటంతో కేవలం ఒక కాళేశ్వంరం ప్రాజెక్టు ద్వారా 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందదించడంలో ఎలాంటి అంతరాయాలు లేవని అధికారులు చెప్పారు. ఒకవైపు నీటి పారుదల ప్రాజెక్టుల్లో నీటినిల్వలు సంవృద్ధిగా ఉండటం మరోవైపు రాష్ట్రంలోని 46వేల517 చెరువుల్లో నీరు పుష్కలంగా చేరడంతో పాటుగా వందలాధి చెరువుల నీరు మత్తడి దూకి పరవళ్లు తొక్కుతున్నాయి. మరోవైపు భూగర్భజలాలు పెరగడంతో బోర్ల పై ఆధార పడిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇంకా సరిహద్దు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుల్లోకి వరదనీరు చేరుతుంది. అలాగే రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు ఈవరదనీటికి తోడవుతున్నాయి. ప్రాజెక్టుల్లోని గేట్ల నుంచి నీళ్లు పరవళ్లుతొక్కుతున్న దృశ్యాలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

జలకళ సంతరించుకున్న రిజర్వాయర్లు

- Advertisement -

కృష్ణా,గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లో నీరు సంవృద్ధిగా ఉంది. ప్రాజెక్టులవారిగా పరిశీలిస్తే జూరాల రిజర్వాయర్‌ సామర్థ్యం 9.66 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 8.57 టిఎంసీలు ఉన్నాయి. ఇన్‌ ఫ్లో 216000 క్యూసెక్కులు ఉండగా ఔట్‌ ఫ్లో 189406 ఉంది. శ్రీశైలం లో 215.81 టీఎంసీలు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 211.48 ఉంది. ఇన్‌ ఫ్లో 401187 క్యూసెక్కులు ఉండగా ఔట్‌ ప్లో 445745 ఉంది. నాగార్జున సాగర్‌ ఇన్‌ ప్లో 394606 క్యూసెక్కులు ఉండగా ఔట్‌ ఫ్లో 394606 ఉంది. మూసీ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 4.46 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 4.06 ఉంది. అలాగే ఇన్‌ ఫ్లో, ఔట్‌ ఫ్లో 3914క్యూసెక్కులు ఉంది. సింగూరు నీటి నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 28.72 టీఎంసలకు చేరింది.

అలాగే ఇన్‌ ఫ్లో 36000క్యూసెక్కులు,ఔట్‌ ఫ్లో 45200 క్యూసెక్కులు ఉన్నాయి. నిజాం సాగర్‌ నీటి సామర్థ్యం 17.80 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 17.66 ఉంది. అలాగే ఇన్‌ ఫ్లో కంటే ఔట్‌ ఫ్లో అధికంగా ఉంది. శ్రీరాం సాగర్‌ 90.31టిఎంసీల నీటి సామర్థ్యంకు సమానంగా నీరుచేరుకోగా ఇన్‌ ఫ్లో కంటే ఔట్‌ ఫ్లో అధికంగా ఉంది. మిడ్‌ మానేరు నీటి సామర్థ్యం 27.50 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 22.06 టీఎంససీలు ఉన్నాయి. అలాగే లోయర్‌ మానేరు, కడెం, శ్రీపాద రావు ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయిలో నీరు చెరుకోగా ఇన్‌ ఫ్లో, ఓట్‌ ఫ్లోలు సమానంగా ఉన్నాయి. ప్రాజెక్టుల్లో ఓకవైపు వరదనీరు చేరుతుండగానే మరో వైపు దాదాపుగా అదే ప్రవాహ వేగంతో నీటిని విడుదల చేస్తూ రిజర్వాయర్ల పరిధిల్లోని గొలుసుకట్టు చెరువులు,కుంటలు,చెరువుల్లోకి నీరు తరలిస్తుండటంతో రాష్ట్రంలో కన్నుల పండుగా జలదృశ్యం ఆవిష్కరిస్తుంది. రైతన్నల ఆశలు చిగరిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement