ఆలూరు : తన నియోజకవర్గంలో తనను మామ, అన్న అంటూ ఆప్యాయంగా పలకరించే ప్రజలందరూ తనకు బంధువులేనని.. ఆప్యాయతను పంచే నాయకుడు మీకు కావాలా.. లేక అధికారం చెలాయించే నాయకుడు మీకు కావాలా అని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. శనివారం ఆస్పరి మండల పరిధిలోని బినిగేరి గ్రామంలో గడప గడప కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి గుమ్మనూరు జయరాం, వైసీపీ ఆలూరు తాలుక ఇన్చార్జి గుమ్మనూరు నారాయణ స్వామిలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సంక్షేమ పథకాలను మన వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని, ఈ గ్రామానికి ప్రభుత్వం రూ.5 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, అదనంగా గ్రామ మంచినీటి పైపులైను సమస్యను పరిష్కరించుకోవడానికి రూ.10 లక్షలు మీ గ్రామానికి ఇవ్వబోతున్నట్లు, సీసీ రోడ్లు, మురుగు కాలువలకు రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు, మొత్తం ఈ బినిగేరి గ్రామానికి రూ.20 లక్షలు ఇప్పటికిప్పుడు మంజూరు చేస్తున్నట్లు మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ రాఘవేంద్ర, జడ్పీటీసీ దొరబాబు, సింగిల్ విండో చైర్మన్ గోవర్ధన్, మాజీ మండల కన్వీనర్ రామాంజనేయులు, మండల కన్వీనర్ పెద్దయ్య, వెంకన్న, పురుషోత్తం రెడ్డి, మాజీ జడ్పీటీసీ రాం భీమ్ నాయుడు, ఆలూరు మండల కన్వీనర్ వీరేశ్, వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రభుత్వ అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.